ఊట్కూర్, మార్చి 14: కురుమ యాదవుల ఆరాధ్య దైవం బీర లింగేశ్వరస్వామి జాతర ఉత్సవాలు మండలంలోని నిడుగుర్తి గ్రామంలో కనుల పండువగా కొనసాగుతున్నాయి. సోమవారం కురుమ యాద వులు బీర లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని తలపై పసుపు బండారును చల్లుకున్నారు. భక్తుల బీర లింగేశ్వరస్వామి నామస్మరణ తో ఆలయ పరిసరాలు మార్మోగాయి. వివిధ జిల్లాలతో పాటు, మంబాయి, పూణె, సలాపూర్, కర్ణాటకలోని వివిధ పట్టణాల నుంచి కురుమ యాదవులు బీరలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి దంపతులపై పూజారులు పసుపు బండారు చల్లి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల పండుగలకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. భక్తులు గ్రామ దేవతలకు గొర్రెలను బలియిచ్చి విందు భోజనాలను ఆరగించారు. కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు జలంధర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కు మార్‌గౌడ్, సర్పంచ్ యశోదమ్మ, ఎంపీటీసీ రాఘవరెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, లక్ష్మారెడ్డి, భాస్కర్, విజయభాస్కర్‌రెడ్డి, మాదాసి కురువ కుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు టీచర్ పాల్గొన్నారు.