మహబూబ్‌నగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు పాలమూరు అంటే వలసల ఖిల్లా. లక్షలాదిగా పాలమూరు కూలీలు వలసలు వెళ్తారనే విధంగా పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో ఇక్కడ పర్యాటక అభివృద్ధి అనే మాటకే అర్థం లేకుండాపోయింది. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. అభివృద్ధితోపాటు పర్యాటక రంగంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది.
ఎకో టూరిజంలో భాగంగా సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటకంగా అభివృద్ధి చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనూ టూరిజం అట్రాక్షన్స్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యాటక సొబగులను సంతరించుకున్న ఉమ్మడి జిల్లా భవిష్యత్తులో మరిన్ని పర్యాటక సొబగులను సంతరించుకునేందుకు సిద్ధమవుతున్నది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దేవరకద్ర నియోజకవర్గపరిధిలో ఉన్న కోయిల్‌సాగర్, సరళాసాగర్ రిజర్వాయర్ల వద్ద పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సమాధానమిచ్చారు.
పర్యాటకంగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను వివరించారు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, కోయిల్‌సాగర్, సరళాసాగర్‌ను ఓ పర్యాటక సర్క్యూట్లాగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతానికి మరింత కొత్తదనం చేకూరనున్నదన్నారు. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల వద్ద కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యక శ్రద్ధ కారణంగా ఉమ్మడి పాలమూరు పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చెందనున్నదన్నారు.
రిజర్వాయర్ల వద్ద పర్యాటకం..
కాళేశ్వరం అనుబంధంగా ఉన్న రిజర్వాయర్ల వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న తరహాలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న రిజర్వాయర్ల వద్ద పర్యాటక అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసెంబ్లీలో తెలిపారు. దీన్ని బట్టి ఉమ్మడి జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల వద్ద పర్యాటక శోభ సంతరించుకోనున్నది. జాతీయ రహదారిని దాదాపుగా ఆనుకుని ఉన్నట్లుగా కనిపించే ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే హైదరాబాద్ నుంచి కేవలం గంట వ్యవధిలో పర్యాటకులు వచ్చే అవకాశం ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. బోటింగ్ సౌకర్యంతోపాటు పార్కులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.
అలరించే కోయిల్‌సాగర్..
మహబూబ్‌నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌కు తెలంగాణ ఏర్పాటు తర్వాత నిండుకళ వచ్చింది. కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోసి కోయిల్‌సాగర్‌ను నింపడంతో ఎప్పుడు చూసినా జలకళ సంతరించుకుంటున్నది. 1945లో నిజాం పరిపాలన కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. రెండు కొండల మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. నీటి నిల్వ సామర్థ్యం 2.276 టీఎంసీలు కాగా.. మూడేండ్లుగా ప్రాజెక్టు నిండి పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. డ్యాం నిండిన తర్వాత దిగువకు నీటి పరవళ్లు చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అలాగే కోయిల్‌సాగర్ జలాల్లో విహరించాలని ఉత్సాహపడుతుంటారు. కానీ, ఇక్కడ సదుపాయాలు లేకపోవడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. బోటింగ్ సౌకర్యంతోపాటు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, హోటల్స్ ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, పిల్లలమర్రి చూసిన తర్వాత నేరుగా కోయిల్‌సాగర్ వెళ్లి.. అక్కడి నుంచి బోటింగ్ ద్వారా కోయిల్‌సాగర్ ఖిల్లాను పర్యటించే అవకాశం ఉంటుంది. 500 ఎకరాల్లో ఉన్న కోయిలకొండ కోట, సమీపంలోని రాంకొండ తదితర పర్యాటక ప్రదేశాలు ఈ ప్రాంతంలో టూరిజం అవకాశాలను మరింతగా పెంచనున్నాయి. ఈ తరుణంలో కోయిల్‌సాగర్ వద్ద బోటింగ్ సౌకర్యం, కాటేజీలు, పర్యాటక హోటల్ సదుపాయం కోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. కోయిల్‌సాగర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూ.8.30 కోట్ల అంచనాలతో స్వదేశ్ దర్శన్ పథకం కింద ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ నెల 17న పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోయిల్‌సాగర్ వద్ద బోటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు గురువారం పర్యాటక మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.
టూరిజం సర్క్యూట్‌గా సరళాసాగర్..
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి కేవలం 5 కి.మీ దూరంలో ఉన్న వనపర్తి రోడ్డు రైల్వే స్టేషన్‌కు సమీపంలో చక్కటి రవాణా సదుపాయం ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టు ఎందరినో ఆకట్టుకుంటున్నది. ఆటోమెటిక్ ఉడ్ సైఫన్ సిస్టంతో రూపుదిద్దుకున్న సరళాసాగర్ ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది, ప్రపంచంలో రెండో ప్రాజెక్టుగా పేరుగాంచింది. జలాశయం సామర్థ్యానికి మించి ప్రాజెక్టులోకి నీరు చేరితే ఆటోమెటిక్ సైఫన్ స్పిల్‌వే ద్వారా నీరు నదిలోకి విడుదలవుతుంది. భారీ వర్షాలప్పుడు ఈ వింతను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తారు. అయితే, సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ ప్రాజెక్టు అభివృద్ధిపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సరళాసాగర్‌ను పర్యావరణ హిత పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు సర్కార్ పరిశీలిస్తున్నది. ప్రాజెక్టు వద్ద అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేస్తున్నామని గురువారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమాధానమిచ్చారు. బోటింగ్, కాటేజీలు, పార్కులు, క్యాంప్ ఫైర్ ఏర్పాటుతో పర్యాటకుల సందడి పెరిగి ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని స్థానికులు చెబుతున్నారు.