నవాబ్‌పేట, మార్చి10 : ముందస్తు జాగ్రత్తతోనే టీబీని అరికట్టవచ్చని జిల్లా టీబీ నియంత్రణాధికారి రఫీక్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో గురువారం నిర్వహించిన టీబీ నిర్ధారణ వైద్యశిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షల నిమిత్తం శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రఫీక్ మాట్లాడుతూ టీబీ లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నవారు మద్యం, పొగాకు, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులను అంటరానివారిగా చూడరాదన్నారు. శిబిరంలో 185మందికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఎంవో శ్రీనివాస్, కోఆర్డినేటర్ గోపాలకృష్ణ, సిబ్బంది బాలరాజు, రాజు, యాసి న్, రాములు, శకుంతల, కళమ్మ, శరభలింగం, రాఘవేందర్, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.