మహబూబ్‌నగర్, జనవరి 18 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : టీనేజర్లకు వ్యాక్సి న్ ఇవ్వడంలో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండడం అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘దేశంలోని ఆరోగ్య ర్యాంకు ల్లో ప్రస్తుతం తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది.. మొదటి స్థానానికి రావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రైవేటుతో పోటీ పడి ప్రభుత్వ దవాఖాన సిబ్బంది పనిచేయాలన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలని సూచించారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని పీహెచ్‌సీలకు అవసరమైన పరీక్షల కిట్లు పంపించాలని అధికారులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను పకడ్బందీగా చేపట్టాలన్నారు. గర్భిణులకు కొవిడ్ వస్తే జిల్లా స్థాయిలోనే పరీక్షలు నిర్వహించి అక్కడే డెలివరీ చేయాలని.. తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా చూడాలన్నారు. మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానలో సాధారణ డెలివరీల శాతం బాగుండడంపై వైద్యులను అభినందించారు.
టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు 24 గంటలు పనిచేయాలన్నారు. ఏఎన్ఎంలకు ఐపాడ్లు ఇచ్చామని.. ఆశ వర్కర్లకు స్మార్ట్ఫోన్లు అందిస్తామన్నారు. ఇకపై వైద్యానికి సంబంధించిన ప్రతి అంశం ఆన్లైన్లో నమోదు కావాలన్నారు. జిల్లాలో 17 పీహెచ్‌సీల్లో ఆరు దవాఖానలు లక్ష్య పథకానికి ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. మాతాశిశు మరణాలు తగ్గించాలన్నారు. మహబూబ్‌నగర్ పట్టణానికి రెండు కొత్త బస్తీ దవాఖానలు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో రూ.200 కోట్లతో 900 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ త్వరలోనే జిల్లా కేంద్రంలో రూ.300 కోట్లతో ఉస్మానియా, గాంధీ తర్వాత అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించనున్నట్లు చెప్పారు.
15 రోజుల్లో నర్సింగ్ కళాశాలకు టెండర్లు పిలవనున్నామని తెలిపారు. దైవానికి ప్రతిరూపమైన డాక్టర్లు కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయాన్ని పరిశీలించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతారామారావు, డీఎంహెచ్‌వో కృష్ణ, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్, వైద్యులు పాల్గొన్నారు.