వనపర్తి, నవంబర్ 27 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యమలం చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల నాయకులు, ప్రజానిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్ర పాలనలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. సాగునీటి రాకతో ఉమ్మడి జిల్లా స్వరూపమే మారిపోయిందని వివరించారు. నాడు పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్లిన పల్లెలు.. నేడు సాగునీటి రాక, నిరంతర కరెంట్ సరఫరా, రైతుబంధు సాయంతో సొంతూళ్లకు తిరిగి వచ్చారన్నారు. నేడు గ్రామాల్లో పక్షుల కిలకిలారావాలు, ధాన్యం రాశులు దర్శనమిస్తున్నాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది పాలమూరు జిల్లానే అని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పట్టుదలతో ఎనిమిదేండ్లలోనే సమూల మార్పులు సాధ్యమయ్యాయని తెలిపారు. కోర్టు కేసుల మూలంగా పాలమూరు ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరుగుతున్నదని పేర్కొన్నారు.
ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా ఎత్తిపోతలను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో సాగునీరు అందితే బీడు భూముల్లో కృష్ణా జలాలను పారించి పచ్చబడేలా చేస్తామన్నారు. దశాబ్దాల గోస తీర్చిన టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కే ప్రజల ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. డిసెంబర్ 4న పాలమూరుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, ముఖ్యమంత్రి పర్యటనను, ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరగే సభను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, మండల అధ్యక్షుడు మాణిక్యం, యువజన పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు సూర్యవంశం గిరి, చిట్యాల రాము, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిథులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.