బాలానగర్, నవంబర్ 17: నిత్యం జీవితంలో తులసి మొక్కకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కను పూజిస్తే సకల దోషాలు, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే మహిళలు తులసి మొక్కకు ప్రతీ రోజు ఉదయం పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతీ ఇంటిలోనూ తులసీ మొక్క చుట్టూ దీపాలు వెలిగించి పూజలు చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా తులసీ మొక్క ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలోనూ ఈ మొక్కకు చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో తులసి మొక్క విశిష్ట గుణాలు దానికి పూజలు చేస్తారు. తులసీ మొక్క ఉన్న స్థలం తీర్థస్థలం అని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమామైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. రోజూ నిద్ర లేవగానే తులసీని దర్శించడం, స్నానమాచరించిన అనంతరం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలతో, సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత ఫలం కలుగుతుంది.
శ్రీ మహావిష్ణువుకు ప్రాణం..
తులసి అంటే శ్రీ మహా విష్ణువుకు ప్రాతం. ఈ జగత్తులోని సంపద అంతా ఒక వైపు ఉంచితే విష్ణువు మాత్రం తులసినే ఇష్టపడతాడు. శ్రీ కృష్ణ తులాభారం సారాంశం ఇదే. తులసిని కేవలం స్మరిస్తేనే సర్వపాపాలు పోతాయట. మరణశయ్యపై ఉన్నవారికి గొంతులో తులసి తీర్థం పోస్తే ఆ జీవుడి వెంట ఉంచి పుణ్యలోకాలకు తీసుకెళ్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే తులసి మొక్కను తాకడం, దళాలను తెంచడంలోనూ అత్యంత నియమ నిష్ఠలను పాటించాలి. ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారాల్లో తులసిని తుంచరాదు. తూర్పు, ఉత్తర ముఖంలో నిలబడి మాత్రమే దళాలను కోయాలి. ద్వాదశ, అమావాస్య, పున్నమి తిథుల్లో తులసి ఆకులను కోయరాదు. స్నానం చేయకుండా, మైల రోజుల్లో తులసిని తాకరాదు. తులసి విష్ణు పాదాల వద్దే ఉండాలి. వినాయకుడి పూజలకు తులసిని వినియోగించొచ్చు. అయితే చవితి రోజున మాత్రం వినియోగించరాదు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తులసిని తెంచరాదు.
తులసిలో రకాలు..
తులసి మొక్కల్లో అనేక రకాలున్నాయి. వాటిలో లక్ష్మి తులసి తెల్లగా ఉంటుంది. దీనిని పూజలకు వాడతారు. కృష్ణ తులసి నల్లగా ఉంటుంది. రామ తులసి తెల్లగా ఉంటుంది. దీనిని వైద్యానికి వాడతారు. లక్ష్మీ తులసీని కార్తీక మాసంలో ద్వాదశి రోజున కార్తీక మాసం రెండో సోమవారం, ఉసిరిక మొక్క(మహావిష్ణువు మొక్క)కు వివాహం చేసి భక్తులు తరిస్తారు. క్షరాబ్ధి ద్వాదశి, మదన ద్వాదశి, క్షీరాప్తి, శయన వ్రతం మొదలైన పండుగలు తులసి ప్రాధాన్యంగానే జరుపుకొంటున్నారు.
వైద్య రంగంలో వాడకం
తులసి ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నీ వైద్యానికి ఉపయోగిస్తారు. తులసి ఆకు రసం జ్వరాన్ని, రక్త స్రావాన్ని, అతిసారం, వాంతులు, విరేచనాలు తగ్గిస్తుంది. నిమ్మరసంతో కలిపి తులసి ఆకులను వాడితే చర్మ రోగాలు నయమవుతాయి. కఫాన్ని తొలగించి గొంతును శుభ్ర పరిచి సరి చేస్తుంది. చెవి, నొప్పి, నీరసం వంటి రుగ్మతలను నయం చేస్తుంది. తులసి ఆకులతో చేసిన మాల ఆరోగ్యదాయిని, ఇలా ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా తులసి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని భూలోక కల్పవృక్షం అంటారు.