మిడ్జిల్, డిసెంబర్ 2: ‘బావ నీకు..నాకు రుణం తీరిపోయింది. నేను నా బిడ్డా పోయాక నీవు, మీ అమ్మ సంతోషంగా ఉండండి. నీవు ఇంకో పెళ్లి చేసుకో..నేను రోజు కూలీకి పోయి తెచ్చిన డబ్బులు లెక్క చేప్పలేదని, నన్ను దొంగను చేశారు. నా కూలి డబ్బులు, పాడే కోసం, లేకుంటే దినాలకు పెట్టండి’..అంటూ సూసైడ్ లైటర్ రాసి బిడ్డతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మిడ్జిల్లో ఎస్సై జయప్రసాద్ కథనం మేరకు.. మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన శ్రీశైలానికి నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ వాసి సరిత(21)తో రెండేండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి భూమిక(9 నెలలు) సంతానం. శ్రీశైలానికి రెండు ఎకరాల పొలం ఉండగా.. హమాలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతడి భార్య వారి పొలంలో వ్యవసాయ పనులతోపాటు మిగితా సమయంలో కూలీ పనులు చేస్తుండేది. అయితే సరితకు వచ్చే కూలి డబ్బుల విషయమై తరచూ అత్తామామలు ఆమెతో గొడవపడేవారని తెలిసింది. అయితే మంగళవారం ఉదయం తన పాపతో కలిసి సరిత ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. చుట్టుపక్కల వెతికినా.. బంధువుల ఇండ్లల్లో ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త శ్రీశైలం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కాగా గురువారం ఉదయం మిడ్జిల్ శివారులో ఉన్న మేలకుంట చెరువులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీయగా.. సరిత, ఆమె బిడ్డ భూమికగా గుర్తించారు. చిన్నారిని తల్లి ఆమె చీర కొంగుకు కట్టుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా కుటుంబ కలహాల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నదని ఆమె తల్లిదండ్రులు ఎల్లమ్మ, సంగయ్య ఆరోపించారు. తనబిడ్డ అత్తామామలు తరచూ బంగారం, పొలం తీసుకురావాలని గొడవే పడేవారని తమతో చెప్పేదని కన్నీరుపెట్టారు. ఇద్దరి చావుకు అత్తామామలే కారణమన్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయే ముందురోజూ నా బిడ్డతో గొడవ జరిగిందని వారు తెలిపారు.