ఎర్రుపాలెం, జూలై 03 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జీర్ణోద్ధరణ, ధ్వజ ప్రతిష్ఠ సహిత మహా కుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు ప్రాతఃకాల అర్చనలు, చతుర్వేద పారాయణాలు చేశారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి, ఆలయ విమాన గోపురానికి శ్రీ శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి కరకమల సజాతులైన శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి చేతుల మీదుగా మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.

జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వైభవంగా మహా కుంభాభిషేకం
మహా కుంభాభిషేకం అనంతరం జగద్గురువులు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర అన్నదాన సేవా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం.వీరస్వామి, ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవ శర్మ, సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ, వకుళమాత స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వైభవంగా మహా కుంభాభిషేకం