కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 7 : 2024 మార్చి నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉమ్మడి జిల్లా శాఖల ప్రతినిధులు, సభ్యులతో కలిసి మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర నుంచి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వము నుండి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని, కేవలం పెన్షన్ ఉద్యోగ విరమణ పొందిన వారి ఖాతాల్లో జమ చేస్తుండగా, మానసిక వేదనకు గురవుతున్నట్లు వాపోయారు.
పదవీ విరమణ ప్రయోజనాల లబ్ధి చేకూరకపోవడంతో మనోవేదనకు గురవుతూ అనేకమంది అసువులు బాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన ప్రయోజనాలు వెంటనే విడుదల చేసేవారని గుర్తు చేశారు. 35 నుంచి 40 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది, చివరి అంకంలో ఉన్నవారి పట్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటం శోచనీయమ న్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సత్వరమే విడుదల చేయాలన్నారు. జిపిఎఫ్, జిఐఎస్, టీఎస్జిఎల్ ఐ, లీవ్ ఎంక్యాస్మెంట్, కమ్యూటేషన్ గ్రాట్యుటీ, ఐదు పిఆర్సీ బకాయిలు, పెంచిన డి ఏ వాయిదాల పద్దతి కాకుండా నగదు రూపంలో ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.