Viral Video: జంతు ప్రేమికులు కుక్కలు, పిల్లులతో పాటు పలు జంతువులను ఎంతో ఇష్టంగా సాకుతారు. వాటిని ‘పెట్స్’ గా పెంచుకోవడం కొత్తేం కాదు. కొంతమంది విషసర్పాలైన పాములను సైతం పెంచుకుంటారు. కానీ బల్లితో స్నేహం చేసే వ్యక్తులను ఎప్పుడైనా చూశారా..? అదేంటి..! బల్లి మీద పడితేనే అరిష్టం అన్నట్టుగా.. అది మీద పడ్డా సబ్బులు అరిగేదాకా చర్మం ఊడేదాకా రుద్దుకునే వ్యక్తులున్న ఈ సమాజంలో ఓ వ్యక్తి దానిని పెంచుకుంటున్నాడు. పెంచుకోవడమంటే అదేదో నువ్వు గోడమీద ఉండు.. నేను బెడ్ మీద ఉంట అన్నట్టు కాదండోయ్..! బల్లితో ‘స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల..’ అనుకుంటూ సాంగులూ సింగుతున్నాడు. నెల రోజులుగా చూపరులను ఆకర్షిస్తున్న ఈ బల్లి – మనిషి స్నేహం కథేంటో మీరూ చదవండి…
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన దినేశ్ లోధి అనే వ్యక్తి ఓ సాధారణ కార్మికుడు. నెల రోజుల క్రితం అతడు తన ఇంట్లో పడుకుని ఉండగా అతడి షర్ట్ జేబులోకి బల్లి దూరింది. ఉదయాన్నే లేవగానే జేబులో ఏదో ఉందని అనుకున్న అతడు దానిని బయటకు తీసి బయటపారేయబోయాడు. కానీ ఆ బల్లి మాత్రం దినేశ్ సావాసాన్ని వీడలేదు. పడేసిన ప్రతీసారి ఆ బల్లి వచ్చి దినేశ్ దగ్గరకు వచ్చి ‘ఇవాళ్టి నుంచి మనం జాన్ జిగ్రీ దోస్తులం’ అని వేడుకుంది. అలా మొదలైన ఈ ఇద్దరి స్నేహం.. నెల రోజుల నుంచి నిరాటంకంగా సాగుతోంది.
నువ్వెక్కడుంటే నేనక్కడుంట…
దినేశ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి బల్లిని వెంటబెట్టుకునే వెళ్తున్నాడు. దినసరి కూలీ అయిన దినేశ్.. పనికి వెళ్తూ బల్లిని తీసుకెళ్తాడు. దినేశ్ పని చేసుకునే క్రమంలో ఆ బల్లి అక్కడే ఉన్న ప్రాంతాలలో షికారు చేసొస్తుందట. ఎంత బయటకు వెళ్లినా తన స్నేహితుడు ఉన్నాడా..?లేదా..? అని ఓ కంట కనిపెట్టుకుంటూ టైమ్ లోగా తిరిగి దినేశ్ దగ్గరికి టంచనుగా వచ్చి చేరుతుందట..
#WATCH | #MadhyaPradesh Man Finds Best Friend In Lizard, Takes It To Work Daily, Enjoys Bonfire Together #MPNews pic.twitter.com/ymM5q7R71R
— Free Press Madhya Pradesh (@FreePressMP) January 8, 2024
బల్లికి చలి తగలొద్దని..
ఉత్తరాదిలో చలి తీవ్రత ఎక్కువ. దినేశ్‌తో కలిసి బయటకు వస్తున్న బల్లి కోసం అతడు ప్రత్యేకంగా స్వెటర్ వేసుకుని వస్తున్నాడట. ఎక్కువగా ఎండలోనే పనిచేసే దినేశ్‌తో పాటు ఉండే బల్లి.. అతడు వేసుకునే స్వెటర్లోనే అతడి పనికి విసుగు కలిగించకుండా చలికాచుకుంటుందట. బల్లికి ప్రత్యేక దుస్తులు కుట్టించేంత స్తోమత తనకు లేకపోయినా దానికి చలి నుంచి రక్షణ కల్పించడానికి తన వంతు సాయం చేస్తున్నాడు దినేశ్..
బల్లి కుట్టినా ఏం కాలే..
దినేశ్ గతంలో ఓసారి పాముకాటుకు గురయ్యాడు. అయితే అతడే పాము విషాన్ని తీసేసి తర్వాత చికిత్స కూడా చేయించుకున్నాడు. అతడి కొత్త ఫ్రెండ్ బల్లి కూడా దినేశ్‌ను రెండు మూడు సార్లు కోపంలో కుట్టేసిందట. కానీ దాని నుంచి తనకేమీ అపాయం కలగలేదని అతడు చెప్పాడు. దినేశ్ నుంచి ప్రమాదమేమీ లేదని గ్రహించిన తర్వాత బల్లి ఇక అతడి ఇంటిలో యమాదర్జాగా తిరగేస్తుందట.. దినేశ్ చేతులు, కాళ్లు, తల, టోపీ మీద ఉంటూ ‘కొంతకాలం కిందట.. బ్రహ్మదేవుడి ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం’ అనుకూంటూ పాటలు పాడుతుందట..! కుల్లు, కుతంత్రాలు నింపుకున్న స్వార్థపరులతో సావాసం కంటే అభం శుభంతెలియని మూగజీవాలతో స్నేహం బాగుంది కదా…!!