జబల్పూర్, మే 11: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు శనివారం నోటీసులు ఇచ్చింది. ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకం పేరుపై వివాదం నేపథ్యంలో వివరణ ఇవ్వాలని కోరింది. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ పేరును ఈ పుస్తకం పేరులో ఉపయోగించడంపై అభ్యంతరం తెలుపుతూ క్రిస్టోఫర్ ఆంటోనీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
క్రైస్తవుల మనోభావాలను కరీనా గాయపరిచారని ఆరోపించారు. ఈ పిటిషన్ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. ఈ పిటిషన్పై జవాబు చెప్పాలని కరీనాకు నోటీసులు జారీ చేసింది. ఈ పుస్తకం విషయంలో అడ్వకేట్ ఆంటోనీ పట్టు వదలకుండా కరీనాపై పోరాడుతున్నారు. ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. తర్వాత మెజిస్ట్రేట్ కోర్టుకు, అడిషనల్ సెషన్స్ కోర్టులకు వెళ్లగా అక్కడ ఆయన పిటిషన్లను కోర్టులు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.