డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మంగళవారం జరిగిన మహిళల 3X3 బాస్కెట్బాల్ ఫైనల్లో తెలంగాణ 21-11తో కేరళపై అద్భుత విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆసాంతం తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన రాష్ట్ర జట్టు విజయకేతనం ఎగరవేసింది. రెండేండ్ల క్రితం గోవాలో జరిగిన తుది పోరులోనూ మన మహిళల జట్టు అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ జట్టులో పుష్ప, హర్షిత, ప్రియాంక, గుల్బాశ్ అలీ అదరగొట్టారు. మరోవైపు పురుషుల బాస్కెట్బాల్ తుదిపోరులో మధ్యప్రదేశ్ 22-20తో కేరళపై గెలిచి స్వర్ణం దక్కించుకుంది. తెలంగాణ ప్రస్తుతం ఒక స్వర్ణం, రెండు కాంస్యాలతో 24వ స్థానంలో కొనసాగుతున్నది.