హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): లష్కర్ పరిరక్షణకు ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ పరిరక్షణకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తలపెట్టిన శాంతిర్యాలీపై రేవంత్ సర్కారు నిర్బంధకాండకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. నిరసనకారులను అక్రమంగా అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు.
రేవంత్ సర్కారు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్న దని ధ్వజమెత్తారు. అసమర్థ, ఏకపక్ష నిర్ణయాలను ప్రజలతో కలిసి ప్రతిఘటిస్తామని స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో జంటనగరాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అభివృద్ధిని కనుమరుగు చేసేందుకు కపటనాటకాలు ఆడుతున్నదని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నిరంకుశ ప్రభుత్వం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. సుమారు 220 ఏండ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పరిరక్షణకు శాంతిర్యాలీగా వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పిరికితనంతో శాంతీర్యాలీకి రాత్రికి రాత్రే అనుమతులు రద్దుచేయించారని దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ డీలిమిటేషన్‌ను అశాస్త్రీయంగా చేసిన ప్రభుత్వం..ఇప్పుడు లష్కర్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్త్నునదని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరిచి అసంబద్ధ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఉన్నారు.