సిరిసిల్ల టౌన్, జనవరి 17: వర్కర్ టు ఓనర్ పథకం అమలు కోసం బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని, కేటీఆర్ నాయకత్వంలో త్వరలో సిరిసిల్ల కేంద్రంగా మహాధర్నా తలపెట్టబోతున్నట్టు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. నేత కార్మికులను యజమానులుగా చేసేందుకు రూ.377 కోట్లతో చేపట్టిన వర్కర్ టు ఓనర్ పథకం కోసం నిర్మించిన వర్క్ షెడ్లను కార్మికులకు అందించి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కేటీఆర్.. ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతిలోపు పథకాన్ని అమలు చేయకపోతే పదివేల మంది నేతకార్మికులను సమీకరించి మహాధర్నా చేపడతామని హెచ్చరించారు.
ఈ మేరకు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నేతన్నపై కాంగ్రెస్ చావు దెబ్బ-సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడుకుందాం’ అనే కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నేతన్నల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములు, యజమానులు, అనుబంధ రంగాల కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడుస్తున్నా వస్త్ర పరిశ్రమను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. సమావేశంలో నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.