హైదరాబాద్, జనవరి 17 (నమస్తేతెలంగాణ): ‘ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు కోటి సాక్ష్యాలున్నా తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకొనేందుకు వెనుకాడుతున్నరు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాహుల్‌గాంధీతో కండువా కప్పించుకున్నామని చెప్తున్నా.. ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చినా.. ఫలనా ఫలనా వాళ్లు తమ పార్టీలో చేరారని కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసినా స్పీకర్ మాత్రం కండ్లకు గంతలు కట్టుకొని ‘నాకేం కనబడడం లేదు.. నాకేం తెలియడంలేదు’ అంటున్నరు.. స్పీకర్‌ను, ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు’అని ధ్వజమెత్తారు.
తెల్లారి లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని ఫోజులు కొట్టే రాహుల్‌గాంధీకి ఇది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రాహుల్‌ను, ఆయన ఆధీనంలో ఉండే ప్రభుత్వ వ్యవహారాన్ని చూసి ఫిరాయింపుల చట్టం తెచ్చిన రాజీవ్‌గాంధీ ఆత్మక్షోభిస్తుందని స్పష్టంచేశారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయం మరిచిపోవద్దని సూచించారు. ‘ఈ ఇంటి కాకీ ఆ ఇంటి మీద వాలొద్దని గప్పాలు కొట్టిన రేవంత్‌రెడ్డికి పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకొనేందుకు సిగ్గులేదా? కనీసం సోయిలేదా? అబద్ధాలు చెప్పడానికి ఇంగీతం ఉండాలి కదా?’ అని నిలదీశారు.
జర్నలిస్టులను టెర్రరిస్టుల్లా అరెస్ట్ చేయడం దుర్మార్గం
తెలంగాణ జర్నలిస్టులను టెర్రరిస్టుల్లా అరెస్ట్ చేయడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టడం దురదృష్టకరమని వాపోయారు. సర్కార్‌ను నడుపుమని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారమిస్తే సర్కస్ నడుపుతున్నారని ఎద్దేవాచేశారు. దేశంలో కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అంధకారం తప్ప అభివృద్ధి ఉండదని చురకలంటించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ పాలన అని మండిపడ్డారు. జర్నలిస్టుల గొంతునొక్కితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని తేల్చిచెప్పారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.