బండ్లగూడ, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవిస్తున్నామని ‘మూసీ’ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్జ్’ పేరిట శుక్రవారం అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు.
అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను ప్రస్తావించి, తమ ఇండ్లను కూల్చకుండా చూడాలని ప్రజా ప్రతినిధులను కోరారు. పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేశామని, తమ బతుకులను కూల్చొద్దని కన్నీటి పర్యంతమయ్యారు. అనుమతులన్నీ ఉన్నాయని, ఇంటిని వదిలి వెళ్లేదిలేదని, ఇండ్లు కూల్చ కుండా అభివృద్ధి చేయాలని వారు కోరారు.