మధిర, ఏప్రిల్ 11 : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల మధిర రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అవుతుందని బిజెపి మధిర నియోజకవర్గ ఇన్చార్జి ఏలూరు నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రైల్వే అధికారులు పాత గేటు వద్ద చేపట్టిన గోడ నిర్మాణం పనులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తుల స్వార్థం కారణంగా అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ఆలస్యం కావటానికి కారణంగా కనిపిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యుటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ ఆర్ అండ్ బి, మున్సిపాలిటీ, రైల్వే అధికారులతో మాట్లాడి అండర్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేయాలన్నారు.
పాత రైల్వే గేట్ దగ్గర మూడో లైన్ నిర్మాణం కోసం అడ్డుగా గోడ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నాయకులు సంబంధిత రైల్వే అధికారులను, స్థానిక R&B, అధికారులు మున్సిపాలిటీ కమిషనర్ ని కలవడం జరిగిందన్నారు. రైల్వే గేట్ దగ్గర అండర్ బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల ప్రజలు, స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం స్పందించి మధిర ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు, అధికార ప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు, పట్టణ, మండల అధ్యక్షులు శివరాజ్ సుమంత్, గుండా చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కుంచం కృష్ణారావు, మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ మర్శకట్ల స్వర్ణకార్, పాపట్ల రమేశ్, గడ్డం శ్రీహరి, పట్టణ ప్రధాన కార్యదర్శి పగడాల నాగేంద్రబాబు, మాదిరాజ్ సాయిరామ్ పాల్గొన్నారు.