న్యూఢిల్లీ: అన్నం లేదు. నీళ్లు లేవు. ఉన్నచోట ఉండలేరు. పారిపోదామంటే మార్గం లేదు. బస్సుల్లేవు. రైళ్లలో ఎక్కనివ్వరు. నడకే దిక్కు. ఎముకలు కొరికే చలి. రక్తం గడ్డ కట్టే చల్లటిగాలి. కానీ తప్పదు. బతికుండాలంటే చావుకు ఎదురీది దేశం దాటాల్సిందే. ఉక్రెయిన్లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం. ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి వచ్చిన ఒక్కో విద్యార్థిది ఒక్కో కథ. ఉక్రెయిన్ నుంచి బయటపడటానికి తాము ఎంత కష్టపడాల్సి వచ్చిందనేది విద్యార్థులు భావోద్వేగంతో పంచుకొంటున్నారు. ‘నేను మళ్లీ తిరిగి ఇంటికి వస్తానని అస్సలు అనుకోలేదు’ అని యూపీకి చెందిన సంస్కృతి సింగ్ చెప్పారు. ‘ఎయిర్పోర్టులు మూసేశారు. హాస్టళ్లకు ఆహారసరఫరా నిలిచిపోయింది. సరిహద్దులకు చేరుకొనే క్రమంలో ఎంతో ఇబ్బంది పడ్డాం. సరిహద్దుల్లో మమ్మల్ని కుక్కల్లా చూశారు’ అని బాధతో తెలిపారు. ఖార్కీవ్ రైల్వే స్టేషన్కు వెళ్లడానికి 10 కిలోమీటర్లు నడిచామని బుధవారం పోలెండ్ నుంచి ఢిల్లీకి చేరుకొన్న ముగ్గురు విద్యార్థులు తెలిపారు. స్టేషన్లోకి వెళ్లనివ్వడానికి పోలీసులు లంచం అడిగారని, కొట్టారని చెప్పారు. ‘ఖార్కీవ్ దాడులు మొదలవుతాయన్న సంకేతాలు అందగానే మిగతా దేశాలు తమ పౌరులకు సంబంధించి ఎంబసీలకు మార్గదర్శకాలు జారీ చేశాయి. భారత ప్రభుత్వం చాలా ఆలస్యం చేసింది. ఖార్కీవ్లో భారతీయులకు ఎలాంటి సూచనలు చేయలేదు. విద్యార్థులను తరలించడానికి ప్రభుత్వం ముందే ఎందుకు చర్యలు చేపట్టలేదు’ అని ప్రశ్నించారు. నేను ఖార్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్నా. ‘ఖార్కీవ్లో ఎంబసీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. అతి కష్టమ్మీద ఖార్కీవ్ దాటాను’ అని మహారాష్ట్ర విద్యార్థి అనికేత్ భావుసాహెబ్ చెప్పాడు.