మాస్కో: వ్లాదిమిర్ పుతిన్ ఓ టెర్రర్. ఆయనతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు. తాజాగా ఉక్రెయిన్‌పై దాడికి ప్లాన్ వేసినా.. రష్యా అధ్యక్షుడు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ ఇటీవల ఆయన ప్రపంచ నేతలతో భేటీ అవుతున్న తీరు అందర్నీ స్టన్ చేస్తోంది. ఆ సమావేశాల్లో పుతిన్ కూర్చుంటున్న టేబుల్ ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. భారీ వైట్ గోల్డ్ కలర్ టేబుల్‌పై ఇప్పుడు అందరి కళ్లు పడ్డాయి. అత్యంత పొడువైన టేబుల్ వద్ద .. విదేశీ నేతలతో పుతిన్ ఏకాంత చర్చలు చేస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ ఆ టేబుల్‌పై మాత్రం ఆన్లైన్ మీమ్స్ హల్చల్ సృష్టిస్తున్నాయి.
ఉక్రెయిన్‌తో టెన్షన్ తగ్గించేందుకు యురోప్ నేతలు ఇటీవల పుతిన్‌ను కలిశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్లతో వేరు వేరు సమయాల్లో పుతిన్ భేటీ అయ్యారు. ఆ సమయంలో భారీ పొడువైన టేబుల్ వద్ద వారి మీటింగ్ జరిగింది. ధగధగ మెరుస్తున్న ఆ టేబుల్ సుమారు ఆరు మీటర్ల పొడువు తుంది. టేబుల్‌కు ఒకవైపు పుతిన్.. మరో వైపు ఓ దేశాధినేత కూర్చుని చర్చలు నిర్వహించారు. 20 ఫీట్ల పొడుగు ఉన్న ఈ టేబుల్‌ను .. కరోనా వైరస్ ప్రోటోకాల్‌లో భాగంగా వాడుతున్నారు. పుతిన్‌కు.. వచ్చిన అతిథికి మధ్య తగ్గినంత దూరం మెయిన్టేన్ చేసేందుకు ఈ టేబుల్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి అవుతున్న నాటి నుంచి పుతిన్ అత్యంత జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. క్యాబినెట్‌తో కానీ, అధికారులతో కానీ భేటీ అయినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద టేబుల్స్ వద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పుతిన్ తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు ఎలా ఉన్నా.. వైట్ కలర్ గోల్డ్ కోటెడ్ టేబుల్‌పై మాత్రం ఆన్లైన్లో ట్రోలింగ్ జోరుగా సాగుతోంది. పుతిన్ వంటరి తనానికి లోనైనట్లు కొందరు కామెంట్ చేశారు. కొందరు దాన్ని జీసెస్ లాస్ట్ సప్పర్ టేబుల్ గా భావిస్తున్నారు. ఆ టేబుల్ ఓ స్కేటింగ్ ఎరినా అని మీమ్స్ చేశారు. ఐస్ హాకీ కూడా ఆడుతున్నట్లు కొందరు ట్రోల్ చేశారు. అంత్యత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నుంచి క్షేమంగా ఉండేందుకు ఆ టేబుల్స్‌ను వాడుతున్నట్లు రష్యా అధికారులు చెబుతున్నారు. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ రెనోవేషన్ సమయంలో ఈ వైట్ టేబుల్‌ను ఇటలీకి చెందిన వ్యాపారి తయారు చేశాడు. దీని ఖరీదు లక్ష యూరోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.