హైదరాబాద్ : భూ భారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై విచారణకు లోకాయుక్త ఆదేశించింది. సుమోటోగా కేసు నమోదు చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. భూభారతి చట్టాన్ని వాడుకుని ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. జనగామ జిల్లా కేంద్రంలో ఒకే రోజు రూ.8 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పక్కదారి పట్టించిన ఘటన బయటకు రావడంతో లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది.
భూ భారతిలో జరిగే కుంభకోణానికి సీసీఎల్ఏ టెక్నికల్ టీమ్ సహకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ, మీ సేవ కమిషనర్, జనగామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల అధికారులకు ఆదేశాలు జారీచేసింది.