హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం లోక్ అదాలత్‌లు నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 1,28,660 క్రిమినల్ కేసులు, 1,816 సివిల్ కేసులతోపాటు దర్యాప్తు దశలో ఉన్న (ప్రీ లిటిగేషన్) కేసులు 49,524 ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీ నవీన్‌రావు, జస్టిస్ గండికోట శ్రీదేవి సారథ్యంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 447 కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.6.5 కోట్ల పరిహారం అందింది. సిటీ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 850 కేసులను పరిష్కరించి కక్షిదారులకు రూ.32 కోట్ల పరిహారాన్ని అందించారు. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 181 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.5.93 కోట్ల పరిహారం చెల్లించారు.