వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 22 : వరంగల్ రాంకీ విల్లాస్లోని హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న గృహ సముదాయానికి అక్రమంగా చేపట్టిన రోడ్డు మళ్లింపు పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నోటిమాట ఆధారంగా ఆమె అనుచరుడు, రాంకీ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రహరీ కూల్చివేత, దారి మళ్లింపు, గేటు నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్రమంగా కూల్చివేతలు, నిర్మాణాలు చేపడుతున్న మంత్రి అనుచరుడిపై, రాంకీ అసోసియేషన్ ప్రతినిధులపై హౌసింగ్ బోర్డు అధికారులు సరైన చర్యలు తీసుకోకుండా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు.
హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అంకమరావు ఫిర్యాదు స్వీకరించిన మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి, కూల్చివేతలను, నిర్మాణాలను అడ్డుకోవాల్సింది పోయి సీఐ సార్ అందుబాటులో లేరని, ఆయన సంతకం చేస్తేనే కేసు నమోదు సాధ్యమవుతుందని చెప్పి మిన్నకుండిపోవడంతో సంపన్నుల పనులు సాఫీగా సాగుతున్నాయి.
ఓ వైపు మంత్రి కొండా సురేఖ మౌఖిక ఆదేశాలతో ఆమె అనుచరుడి ఆధ్వర్యంలో చకచకా సాగుతున్న పనులు, మరో వైపు కంటికి కనిపించని హౌసింగ్ బోర్డు అధికారుల తీరుతో ఔత్సాహికులు వెనుదిరిగిపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలు, రాంకీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలు, విల్లా కొనుగోలు దారులు చేసుకున్న ఒప్పందాల్లోనూ వివరాలు ఉన్నప్పటికీ లేఅవుట్లో మార్పులు చేయడాన్ని అధికారులు అడ్డుకోకపోవడంపై సామాన్యులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. మూడు రోజులుగా ‘నమస్తే’ ప్రచురించిన కథనాల్లో ప్రస్తావించిన అంశాలకు అధికారులు జవాబు ఇవ్వకపోవడంతో చాలావరకు వచ్చిన వారంతా వెనుదిరిగిపోతున్నారు.