సినిమాను తెరకెక్కించడంలోనే కాదు, దాన్ని ప్రమోట్ చేయడంలో.. మార్కెటింగ్ జరపడంలోనూ దిట్ట దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ స్థాయిలో ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు అంబరాన్ని తాకాయి. దీనికి తగ్గట్టుగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా రకరకాల ఊహాగానాలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 700కోట్ల బడ్జెట్ అని ఒకరంటే.. కాదు వెయ్యి కోట్లని మరొకరు. కానేకాదు 1500కోట్లని ఇంకొకరు. ఇలా ఈ సినిమా బడ్జెట్ విషయంలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకు నిర్మాత కె.ఎల్.నారాయణ అన్ లిమిటెడ్ బడ్జెట్‌ని కేటాయించారట.
కథ డిమాండ్ మేరకు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదనే పంథాలో ఆయన ముందుకెళ్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఖర్చు ఎంతైనా, దాన్ని రాబట్టుకోవడం రాజమౌళికి బాగా తెలుసు. అందుకే ‘వారణాసి’ హాలీవుడ్ వెర్షన్‌ని కూడా ఆయన సిద్ధం చేస్తున్నారట. హాలీవుడ్ ప్రేక్షకులకు ‘వారణాసి’ నచ్చితే.. ఆ అంకెలు వేరే విధంగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ దాకా వెళ్లడంతో హాలీవుడ్‌లోనూ రాజమౌళి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా బిజినెస్ పూర్తయిన తర్వాతే పారితోషికాలు తీసుకోవాలని రాజమౌళి, మహేశ్‌బాబు భావించారట. దాంతో ప్రస్తుతం నిర్మాత ప్రతి పైసా సినిమాకే ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా రాజమౌళి స్ట్రాటజీనే వేరు.