సిటీబ్యూరో, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): నల్గొండలో పంక్చర్ దుకాణం పెట్టిన హర్యానా వాసి.. లారీ టైర్ల కంటెయినర్లతో ఉడాయించి లక్షలు కాజేశాడు. దోపిడీల కోసం ప్రత్యేకంగా ఓ ముఠానే తయారు చేశాడు. చోరీ సొత్తును సగం ధరకే విక్రయిస్తూ నగదుతో సొంతూరుకు ఉడాయిస్తాడు. ఈ పంక్చర్ యజమాని దోపీడీ గుట్టును మంగళవారం రాచకొండ పోలీసులు రట్టుచేశారు. వివరాలిలా ఉన్నాయి.హర్యానాకు చెందిన జంషీద్ ఖాన్ రెండేండ్ల కిందట నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి వచ్చి ఓ పంక్చర్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జంషీద్‌కు టైర్ల వ్యాపారులు అఫ్రోజ్, బాసిత్ లారీ ట్యూబుల విక్రయదారుడు కమల్ కాబ్రతో పరిచయం ఏర్పడింది. ఆ మధ్య జంషీద్ హర్యానాకు వెళ్లాడు. అక్కడి స్నేహితులైన రాఫిల్ ఖాన్, ఆజాద్‌తో చర్చించాడు. అక్కడ తమిళనాడు తిరుచీ నుంచి హర్యానాకు వెళ్తున్న టైర్ల కంటెయినర్ల గురించి తెలుసుకున్నాడు. ఆ కంటెయినర్లను లూటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారులతో పరిచయం ఉండటంతో వారికి కొత్త టైర్లను సగం ధరకే విక్రయిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. దీంతో టైర్ల లోడ్ కంటెయినర్ల దోపీడీకి జంషీద్ శ్రీకారం చుట్టాడు. ఈ నేపథ్యంలోనే జనవరి నెల 18న 220 లారీ టైర్లు దోపిడీ చేశాడు. వాటిని సగం ధరకే విక్రయించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ఓ లారీని ఆపి తుపాకీతో డ్రైవర్, క్లీనర్లను బెదిరించి బంధించాడు. లారీలోని ఎంఆర్ఎఫ్ 192 టైర్లను దోపీడి చేసిన నిందితుడు వాటిని రాజేంద్రనగర్‌లో ఖాళీ చేశాడు. ఆ తర్వాత లారీతో పాటు డ్రైవర్, క్లీనర్లను విడిచిపెట్టాడు.
ఈనెల 18న ఫిర్యాదు అందిన వెంటనే రాచకొండ పోలీసులు హూటాహుటిన దర్యాప్తు మొదలు పెట్టారు. స్పైస్ జెట్‌లో జంషీద్ ఢిల్లీ వెళ్లినట్లు పోలీసులు పసిగట్టారు. అతడు విమానంలో ఉన్నట్లు తెలుసుకున్న సీపీ మహేశ్ భగవత్ ఢిల్లీ డీసీపీ త్యాగితో మాట్లాడారు. విమానాశ్రయ సిబ్బందిని అలర్ట్ చేశారు. జంషీద్ దోపిడీ చేసిన 50 లక్షలు విలువజేసే ఎంఆర్ఎఫ్ టైర్లను రూ. 22 లక్షలకు విక్రయించినట్లు విచారణలో నిందితులు తెలిపినట్లు తెలిసింది.
విమానాశ్రయం పోలీసులు పట్టుకోగానే జంషీద్ వారి అనుచరులకు ఫోన్ చేసి ‘పోలీసు పకడ్లియా’ అంటూ ఒకే మాట చెప్పాడు. అంతే అనుచరులు వారి ఖాతాల్లో ఉన్న రూ.10 లక్షల నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. మరో రూ.9 లక్షల నగదును రాచకొండ పోలీసులు జంషీద్ ఖాతాలో ఉండగా ఫ్రీజ్ చేశారు. ఈ దోపిడీ గ్యాంగ్‌ను పట్టుకున్న రాచకొండ పోలీసులను సీపీ మహేశ్ భగవత్ అభినందించి, రివార్డులను అందించారు. ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, క్రైం డీసీపీ యాదగిరి, ఏసీపీ వనస్థలిపురం పురుషోత్తమ్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, పబ్బతి వెంకటేశ్వర్లు, దేవేందర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, పహాడీషరీఫ్ సిబ్బందిని ప్రశంసించారు.