ఉట్నూర్, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్‌రోడ్‌లో ఉన్న మద్యం డిపోలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మద్యం డిపోలో ఉదయం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. వెంటనే సెక్యూరిటీ గార్డు శంకర్.. డిపో డీఎం, సూపరింటెండెంట్లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. వారు వచ్చేలోగా గోదాం చుట్టూ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. భారీ శబ్దాలతో మద్యం సీసాలు పగలడంతో మంటలు మరింత ఎగిసిపడ్డాయి. ఉట్నూర్ ఫైరింజన్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సాయంత్రం వరకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.100 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రేఖానాయక్ డిపోను సందర్శించి.. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సమాచారమిచ్చారు.