Liquidity Deficit | న్యూఢిల్లీ, జనవరి 25: ఏ పని ముట్టుకోవాలన్న డబ్బే ప్రధానం. కానీ ఈ డబ్బును రుణాలుగా ఇచ్చే బ్యాంకుల వద్ద నగదు కొరత తారా స్థాయికి చేరుకున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నిధుల లేమితో సతమతమవుతున్నాయి. నిధులు లభించకపోవడంతో భారీ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడానికి జంకుతున్నాయి. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ లోటు పదేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ లోటు రూ.3.3 లక్షల కోట్లు(38.2 బిలియన్ డాలర్లు)గా ఉన్నట్లు బ్లూంబర్గ్ ఎకానమి ఇండెక్స్‌లో వెల్లడించింది. 2010 తర్వాత నగదు కొరత ఇంతటి స్థాయిలో ఉండటం ఇదే ప్రథమం.
బ్యాంకింగ్ మార్జిన్లపై ప్రభావం
నిధులు లేక సతమతమవుతున్న బ్యాంకు లు తమ మార్జిన్లపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు విశ్లేషకులు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమంటుండటంతోపాటు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు లిక్విడిటీ తగ్గడానికి ప్రధాన కారణాలని నిపుణులు అంచనావేస్తున్నారు. రూపాయి పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి రిజర్వు బ్యాంక్ తనవద్దనున్న డాలర్లను విక్రయిస్తున్నది. అలాగే వేరియబుల్ రేపోరేటు వేలాన్ని నిర్వహిస్తున్నది. బ్యాం కింగ్ వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు రోజువారిగా వేలం నిర్వహిస్తున్నది. గడిచిన పదిహేను రోజుల్లోనే రెండుసార్లు నిర్వహించిన వేలం ద్వారా రూ.1.45 లక్షల కోట్ల నిధులను మార్కెట్లోకి చొప్పించింది.
ఆర్థిక రంగానికి చేటు
నిధులు లేక బ్యాంకులు సతమతమవుతుండటం దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేయనున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు బీటలు పడే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. అతిపెద్ద బ్యాంకులు తమ రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేసే అవకాశాలుండటంతో అతిపెద్ద ప్రాజెక్టులు నత్తనడకన సాగే ప్రమాదం ఉన్నదంటున్నారు. మరోవైపు డిపాజిట్లు అంతంత మాత్రంగానే ఉండటంతో బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ప్రస్తుతం నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఎన్బీఎఫ్సీలు అత్యధిక వడ్డీకి రుణాలు తీసుకొవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిధుల కొరత రాకుండా పలు చర్యలు తీసుకోవాలి.
– సంజీవ్ బజాజ్, బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ