అత్యవసరాల కోసం ఇంట్లో నగదును దాచుకోవడం చాలా మందికి అలవాటే. అలాగే ఎప్పుడంటే అప్పుడు విత్‌డ్రా చేసుకునే వీలున్న సేవింగ్స్ అకౌంట్లోనూ పైసలను అందుబాటులో పెట్టుకుంటుంటారు. ఎమర్జెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) కోసమే ఇదంతా. అయితే పొదుపు ఖాతాలో ఉండే మొత్తాలకు 4 శాతంలోపే వార్షిక వడ్డీ రాబడి ఉంటుంది. ఇక ఇంట్లో ఉండే నగదుకు ఆ మాత్రం కూడా రాదు. చేతిలో నగదుందన్న ధైర్యం తప్ప. కానీ మిగిలిన ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలతో దాదాపు సమానంగా.. సేవింగ్స్ ఖాతాల వడ్డీ కంటే ఎక్కువ రాబడినిచ్చే సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దాచుకున్న మొత్తానికి భద్రత కూడా ఉంటుంది.
అలాంటి సాధనాల్లో లిక్విడ్ ఫండ్లు ప్రధానమైనవి. ఈ ఫండ్లు స్వల్పకాలిక సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్, టి-బిల్స్, రెపో తదితర సాధనాల్లో మదుపు చేసి రాబడులను ఇస్తాయి. అలాగే ఓవర్‌నైట్ ఫండ్స్ కూడా రెపో, ట్రెప్స్ తదితర ఫండ్లలో మదుపు చేసి ఆదాయాన్ని అందిస్తాయి. మిగతా మ్యూచువల్ ఫండ్ స్కీముల్లాగే వీటిలో ఎగ్జిట్ లోడ్ ఉండదు. లిక్విడ్ ఫండ్లలో ఆరు రోజులలోపు ఎగ్జిటైతే అతి తక్కవ లోడ్ ఉంటుంది. ఇక కాస్త ఎక్కువ రాబడి కావాలనుకుంటే అల్ట్రా షార్ట్ టర్మ్‌లో డ్యూరేషన్ ఫండ్లు, మనీ మార్కెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. అయితే వ్యయం, వచ్చే రాబడులను ముందుగానే అంచనా వేసుకోవాలి.
పన్ను తక్కువ..
స్వల్పకాలిక అవసరాలనుబట్టి వారం రోజుల నుంచి కొన్ని నెలలపాటు మదుపు చేయవచ్చు. వడ్డీ ఆదాయంపై పన్ను తర్వాత రాబడులు వీటిలోనే ఎక్కువ. డెట్ ఫండ్లలో రాబడిపై 30 శాతం పన్నుంటే, వీటిలో 15 శాతం మాత్రమే పన్నుంటుంది. అలాగే ఏడాదికి పైబడిన మదుపుపై కేవలం 10 శాతమే పన్ను పడుతుంది. అందుకే క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉండే ధనికులు, సంస్థలు చాలా వరకు లిక్విడ్ ఫండ్లలో మదుపు చేసి అధిక వడ్డీ ఆదాయాన్ని పొందుతాయి. మిగులు నగదు, సేవింగ్స్ డిపాజిట్ మొత్తాలను ఇలాంటి ఫండ్లలో మదుపు చేసి ఉత్తమ రాబడులను రాబట్టవచ్చు.