న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ మళ్లీ తన పూర్వవైభావాన్ని సంతరించుకుంటున్నది. స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన మొదట్లో భారీగా పతనమైన కంపెనీ షేరు తిరిగి నేలకు కొట్టిన బంతిలా దూసుకుపోతున్నది. గడిచిన ఏడాదికాలంలో అత్యధికంగా రిటర్నులు పంచిన షేరు ఎల్ఐసీదే కావడం విశేషం. దేశీయ టాప్-10 దిగ్గజ సంస్థల్లో ఎల్ఐసీ షేరు 74 శాతం రిటర్నులు పంచింది. దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ 68 శాతం రిటర్నులు పంచగా..బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 47.64 శాతం రిటర్నులు పంచింది. స్టాక్ ఎక్సేంజ్ల వద్ద ఉన్న సమాచారం మేరకు ఈ విషయం వెల్లడైంది. దేశీయ అత్యంత విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం 10 శాతం మాత్రమే మార్కెట్ విలువ పెరగగా.. ఐసీఐసీఐ బ్యాంక్ 28 శాతం, టీసీఎస్ 25 శాతం, ఇన్ఫోసిస్ 22 శాతం చొప్పున బలపడ్డాయి.