దేశంలో పెట్టుబడులు దశాబ్దాలుగా కుటుంబ భద్రత, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించే రాబడుల ఆధారంగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సురక్షిత పెట్టుబడి సాధనాలకు ఇప్పటికీ డిమాండ్ కనిపిస్తున్నది. మార్కెట్ సంబంధిత రిస్క్‌లకు దూరంగా ఉంటూ సంపద సృష్టికి ఇవే మార్గాలు మరి. ఈ ఏడాదికిగాను టాప్-5 సురక్షిత పెట్టుబడి ప్లాన్లు ఏంటో చూద్దామా..
సురక్షితంగా దీర్ఘకాలంలో ఆకర్షణీయ రాబడులను అందించడంలో పీపీఎఫ్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ పథకం వెనుక కేంద్ర ప్రభుత్వం భరోసా ఉండటమే మెజారిటీ మదుపరులు మెచ్చేలా చేస్తున్నది. పిల్లల ఉన్నత విద్యకు లేదా రిటైర్మెంట్ ప్లానింగ్‌కు చక్కని సాధనంగా పరిగణించవచ్చు.
ప్రామాణిక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) కంటే ఎక్కువ రాబడుల కోసం మీరు చూస్తున్నైట్టెతే.. ఈ బాండ్లు మీకు చక్కని పెట్టుబడి సాధనాలే. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వీటిని జారీ చేస్తుంది. కనుక ఇవి సురక్షితమే. వడ్డీరేట్లు 6 నెలలకోసారి మారుతూ ఉంటాయి. జాతీయ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు కంటే 0.35 శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక వడ్డీరేటుతో చట్టబద్ధ పూచీకత్తు కలిగిన పెట్టుబడులను ఆశించేవారికి ఈ బాండ్లు అనువైనవి.
బ్యాంక్, పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) ఎప్పట్నుంచో ఎంతో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా విరాజిల్లుతున్నాయి. ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు ఎఫ్డీలపై అధిక వడ్డీరేట్లను డిపాజిటర్లకు చెల్లిస్తున్నాయి. ఇక పోస్టాఫీస్ ఎఫ్డీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ఏడాది నుంచి ఐదేండ్ల లక్ష్యాలకు ఈ ఎఫ్డీలు లాభదాయకం.
ఎన్ఎస్సీ అనేది ఓ నిర్ధిష్ట ఆదాయ పెట్టుబడి సాధనం. ఇది పోస్టాఫీస్‌లలో అందుబాటులో ఉంటుంది. మధ్యతరగతి ఆదాయ వర్గాలకు సరైన పెట్టుబడి వేదికగా చెప్పుకోవచ్చు. వేతన జీవులకూ ఉత్తమమే.
కుటుంబంలోని ఆడపిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఉద్దేశించినదీ పథకం. అందుబాటులో ఉన్న అన్ని చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో అత్యుత్తమ వడ్డీరేట్లు ఈ స్కీమ్‌కే ఉంటాయి. ఆడపిల్లల తల్లిదండ్రులు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.
పెట్టుబడి ప్రణాళికలు అనేవి.. మన ఆర్థిక లక్ష్యాలు, నగదు అవసరాలు, పన్నుల ఆధారంగా ఉంటాయి. నిజానికి సంప్రదాయ పెట్టుబడుల కంటే మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో రాబడులు ఎక్కువగా కనిపిస్తాయి. అయినప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనాలను వదులుకోకపోవడమే మదుపరి తెలివికి నిదర్శనంగా నిలుస్తుంది. కాబట్టి మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా తీర్చిదిద్దుకోండి.