వాహనదారులకు రాష్ట్ర పోలీస్ శాఖ బంపరాఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి పోలీస్ శాఖ జారీ చేసిన చలాన్లు(జరిమానాలు) చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీగా రాయితీలను ప్రకటించింది. 75 శాతం నుంచి 90 శాతం ఉండడం వల్ల కొండంత ఊరట లభించనున్నది. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రకటించిన రాయితీ విధానం ఈ నెలాఖరు వరకు ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. రెండు, మూడు చక్రాల వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ డ్రైవర్లకు 70 శాతం, హెవీ మోటారు వాహనాలకు 50 శాతం, నో మాస్కు కేసులకు 90 శాతం తగ్గింపు ప్రకటించారు. https://echallan.tspolice.gov.in వెబ్సైట్లో ప్రత్యేక లింక్ ద్వారా పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు అవకాశాన్ని కల్పించింది.
రాంనగర్, మార్చి 2: ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత నియమాలను పాటించడం, మెరుగైన రాకపోకలను కొనసాగించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఈ-చలాన్ విధానాన్ని ప్రారంభించింది. హెల్మెట్ ధరించకుండా, సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలు నడుపడం, త్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్లో డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, నిబంధనల మేరకు నంబర్ ప్లేట్ లేకపోవడం, నంబర్ ప్లేట్ అమర్చకపోవడం, మైనర్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్సు లేకపోవడం, వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకపోవడం, ఇన్సూరెన్స్ చేయించకపోవడం, ఉద్దేశపూర్వకంగా వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకపోవడం లేదా దాచిపెట్టడం, లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా తిరగడం వంటి కారణాలకు పోలీసు శాఖ వాహనదారులకు చలాన్ల రూపంలో జరిమానాలు విధించింది. గడిచిన రెండేళ్ల కాలంగా కొవిడ్ కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో జరిమానాలు చెల్లించడం పేదలకు భారంగా మారింది. దీనిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పేద వారిని జరిమానాల నుంచి తప్పించేందుకు భారీ రాయితీలను ప్రకటించింది. మీసేవా, ఈ సేవలతో పాటు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి సేవలను కూడా వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే కొత్తగా ప్రకటించిన రాయితీలను ఆన్లైన్ చేయడంతో వాహనదారులకు చెల్లించాల్సిన జరిమానాలు, రాయితీ పోను మిగిలినవి మాత్రమే ఆన్లైన్లో కన్పించేలా పొందుపరిచారు. నెల రోజుల కాలంలో వీటిని చెల్లించాలని గడువు విధించారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వాహనదారుల నిర్లక్ష్యం ఖరీదు సుమారు రూ.29 కోట్ల పై మాటే. ఇప్పటి వరకు జిల్లాలో 7,70,374 ఈ చలాన్లు విధించగా, వీటిలో హెల్మెట్ లేకుండా, ర్యాష్ డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్ వాహనదారులు రూ.29 కోట్లు జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉండేది. అయితే, వీటిలో జరిమానాలు విధించడంతో పాటు వాహనదారులు నిబంధనలు పాటించేందుకు జరిమానా చెల్లింపుల్లోనూ పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో సుమారు రూ.7 కోట్లకు పైగా వాహనదారులు చెల్లించారు. మిగితా రూ. 22 కోట్లకు గాను ప్రభుత్వం ప్రకటించిన రాయితీతో సుమారు రూ.6 కోట్ల 30 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ లెక్కన రూ.15 కోట్లు వాహనదారులకు మిగలనున్నాయి. జిల్లాలో 52,977 నో మాస్క్ చలాన్లు విధించారు. వీటికి రూ.5 కోట్ల 29 లక్షల 77 వేలు చెల్లించాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో సుమారు రూ.53 లక్షలు మాత్రమే ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. ఈ లెక్కన ప్రజలకు రూ.5 కోట్ల భారం తప్పింది.
ఈ-చలాన్ విధానం అమల్లోకి వచ్చిన 2019 నుంచి 2022 ఫిబ్రవరి వరకు జిల్లా వ్యాప్తంగా 7,78,970 చలాన్లు జారీ చేశారు. ఇందులో 2,93,330 చలాన్లు మాత్రమే క్లియర్ కాగా 4,85,646 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. జారీ చేసిన చలాన్ల మొత్తం సుమారు రూ.23 కోట్లు ఉంటుందని పోలీసు శాఖ అంచనా వేస్తుంది. ఇందులో రూ.8 కోట్లు చెల్లింపులు జరిగినట్లు, రూ.14 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. రాయితీ నిర్ణయం వల్ల వాహనదారులకు భారీగా ఉపశమనం కలగనుంది. రాయితీ ప్రకటించిన రెండు రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 8వేల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. క్లియరెన్స్‌లో ఎక్కువ శాతం జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన చలాన్లే 4,600కు పైబడి ఉండడం గమనార్హం.
రామగుండం కమిషనరేట్‌లో 2018 నుంచి ఇప్పటి వరకు 12,14,213 కేసులు నమోదయ్యాయి. వీటి ద్వారా రూ.50,90,35,425 రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 4,01,857 మాత్రమే క్లియర్ కాగా, మరో 8,12,356 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రవ్ కైసులు 2,898 నమోదు కాగా, 726 పెండింగ్‌లో ఉన్నాయి. టూ వీలర్లు 10,35,215, త్రీ వీలర్లు 31,488, ఫోర్ వీలర్లు 1,09,325, లారీలు 2,830 ట్రక్లు 5,853, ఇతర వాహనాలు కలిపి మొత్తం 12,18,954 కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో 2020, 2021 సంవత్సరాల్లో భారీగా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2020లో 1,08,413 పెండింగ్ కేసులు ఉండగా, రూ.36,41,8650లు బకాయిలు ఉన్నాయి. 2021లో 1,66,076 కేసులు పెండింగ్‌లో ఉండగా, రూ.57,53, 5725 బకాయిలు ఉన్నాయి. దీంతో ఇటీవలే పోలీసుశాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. నాలుగు అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ ఉంటే వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతోవాహనదారులకు భారీ ఊరట కలిగించింది.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ-చలాన్లను వాహనదారులు ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించాం. కరో నా నేపథ్యంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న క్రమంలో పోలీస్ శాఖ ఆన్లైన్ లోక్ అదాలత్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 31వ తేదీ వరకు చలాన్లు చెల్లించి రాయితీ పొందవచ్చు.
– రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి
చలాన్ల విషయంలో ప్రభుత్వం అందించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వల్ల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. చెల్లింపు సమయాల్లో సాంకేతిక కారణాల వల్ల చలాన్లు చెల్లించినట్లు చూపడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇవన్నీ త్వరలోనే సర్దుకుంటాయి. ప్రభుత్వం కల్పించిన రాయితీని వినియోంచుకుని ఈనెల 31లోగా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలి.
-కరీంనగర్ సీపీ సత్యనారాయణ