Hyderabad Metro | ఉప్పల్, మే 17 : పెంచిన మెట్రో చార్జీలు రద్దు చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు హైదరాబాద్ నాగోలులోని మెట్రో ప్రధాన కార్యాలయం ముందు సీసీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎస్‌యూసీఐ, ఎంసీపీఐ పార్టీలు సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. మెట్రో నష్టాలకు యాజమాన్య తీరే కారణమని ఆయా పార్టీ నాయకులు ఆరోపించారు. నష్టాలను తగ్గించేందుకు ప్రత్యామయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. చార్జీల పెంపును రద్దు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ధర్నా అనంతరం పెంచిన మెట్రో చార్జీలను తగ్గించాలంటూ ఎల్అండ్టీ యాజమాన్యానికి వామపక్ష పార్టీల తరఫున వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ కార్యదర్శి ఎం వెంకటేశ్, సీపీఎం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. ఎల్అండ్టీ యాజమాన్యం మెట్రో ఛార్జీలు పెంచడం సరైనది కాదని అన్నారు. వెంటనే పెంచిన చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో ఎల్అండ్టీ యాజమాన్యానికి జరిగిన ఒప్పందానికి భిన్నంగా ఇప్పటికే చార్జీలు పెంచి ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారని, ఇప్పుడు మళ్లీ చార్జీలు పెంచడమేంటని మండిపడ్డారు. రైల్వే నిర్వహణ ఖర్చు సగం ప్రయాణికుల నుంచి, మిగిలిన సగం రియల్ ఎస్టేట్, యాడ్స్ ఇతరత్రా రిటైల్ వ్యాపారాల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వంతో ఎల్అండ్టీ యాజమాన్యానికి జరిగిన ఒప్పందంలోఉందని తెలిపారు. కానీ దానికి భిన్నంగా చార్జీలు పెంచడం సరైనది కాదని అన్నారు.
మెట్రో నష్టాల్లో ఉందని చార్జీలు పెంచాలని ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సు చేసిందని వారు గుర్తుచేశారు. మెట్రో నష్టాలకు ఎల్అండ్టీ యాజమాన్యమే కారణమని తెలిపారు. రోజు ఐదు లక్షల మంది ప్రయాణికుల చార్జీల ద్వారా సంవత్సరానికి 650 కోట్లు వస్తుంటే యాడ్స్ ఇతర వనరుల ద్వారా 250 కోట్లు మాత్రమే మెట్రో ఆదాయం వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 269 ఎకరాల భూమిని సద్వినియోగం చేసుకోక, తమనష్టాలు తీర్చుకోవడానికి ఇతర వనరులు పెంచుకోలేక ప్రయాణికులపై భారం మోపడం సరైనది కాదని హితవుపలికారు. దేశంలోనే చార్జీలు ఎక్కువగా ఉన్న మెట్రో సర్వీస్ హైదరాబాద్, తిరిగి ఇప్పుడు పెంచడం ప్రజలపై మరింత భారం పడుతుంది అని తెలిపారు. ఎల్అండ్టీ యాజమాన్యం ఏకపక్షంగా మెట్రో చార్జీలను పెంచిందా? లేదా దీనిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాత్ర ఉందా? ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. పెంచిన చార్జీ లు తగ్గించకపోతే ప్రయాణికులతో కలిపి భవిష్యత్తులో ప్రజా ఉద్యమాన్ని రూపకల్పన చేస్తామని హెచ్చరించారు.