ఎవరన్నారు నువ్వు ఒంటరివని? భారత రాజ్యాంగం వేయి అక్షౌహిణులై నీ చుట్టూ పహరా కాస్తున్నది. ఎవరు చెప్పారు చట్టాలు కొందరికే చుట్టాలని? భారతీయ శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్లు నీ ఆత్మగౌరవాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి, నీ భద్రతకు భరోసా ఇస్తున్నాయి. నీ ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే.. ప్రశ్నించడం, నిలదీయడం, పోరాడటం! రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నప్పుడే నీకా ఆత్మబలం వస్తుంది. న్యాయ శాస్ర్తాన్ని ఆపోశన పట్టినప్పుడే నీకు నిగ్గదీసే తెగువ అబ్బుతుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఆ ఘనమైన ప్రయత్నాన్ని ప్రారంభించు. జయం నీదే.
రెస్ట్రూమ్ను వాడుకునే హక్కు
భారతీయ సరాయీల చట్టం- 1867 ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా సరే, ఫైవ్ స్టార్ హోటల్ సహా ఏ హోటల్లోనైనా తాగునీరు, వాష్ రూం వసతిని ఉచి తంగా ఉపయోగించుకోవచ్చు. మొహమాట పడవద్దు. మహిళా! ఆత్మగౌరవం నీ హక్కు.
గోప్యతను పాటించే హక్కు
లైంగిక దాడికి గురైన మహిళ పేరు వెల్లడించకుండానే మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు చేయవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నప్పుడు న్యాయస్థానం అనుమతి లేకుండా బాధితురాలి పేరు, ఫొటో ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ ప్రచురించడానికి వీల్లేదు. ఇండియన్ పీనల్ కోడ్- సెక్షన్ 228ఎ కింద ఈ రక్షణను కల్పించింది ప్రభుత్వం. మహిళా! గోప్యత నీ హక్కు.
అరెస్టును అడ్డుకునే హక్కు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- సెక్షన్ 46 క్లాజు (4) కింద మహిళలను సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యకాలంలో, మరీ అత్యవసరం అయితే తప్ప అరెస్టు చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాల్సిన పరిస్థితే వస్తే.. ఓ మహిళా పోలీస్ అధికారి రాత పూర్వకంగా జుడీషియల్ మేజిస్ట్రేట్ ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆ పరిస్థితే వస్తే, సంబంధిత సెక్షన్లను ఉటంకిస్తూ అధికారులను ప్రశ్నించవచ్చు. మహిళా! ప్రశ్న నీ హక్కు.
గృహ హింస వ్యతిరేక హక్కు
తన జీవిత భాగస్వామి, అతని కుటుంబ సభ్యులు, బంధువుల భౌతిక, మానసిక దాడుల నుంచి న్యాయ పరమైన రక్షణకు గృహ హింస సంరక్షణ చట్టం-2005 హామీ ఇస్తున్నది. మహిళా! నీ శరీరం నీ హక్కు.
జీరో ఎఫ్ఐఆర్ హక్కు
జీరో ఎఫ్ఐఆర్ అంటే సంఘటన జరిగిన ప్రదేశంతో కానీ, అది జరిగిన న్యాయ పరిధితో కానీ సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం. నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోకుండా ఉండటానికి, న్యాయం ఆలస్యం కాకుండా ఉండటానికి జీరో ఎఫ్ఐఆర్ పేరుతో ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఇక జీరో ఎఫ్ఐఆర్ కింద.. సంఘటన పరిధిలోని పోలీస్ స్టేషన్లో కాకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అయితే దానికి సీరియల్ నంబర్ ఇవ్వరు. లేదంటే ‘0’తో సూచిస్తారు. తర్వాత దానిని సంబంధిత పోలీస్ స్టేషన్కు సమర్పిస్తారు. అప్పుడే ఒక సంఖ్య ఇస్తారు. తగిన చర్యలూ తీసుకుంటారు. కాబట్టి, ఎక్కడ అన్యాయం జరిగినా, అందుబాటులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. మహిళా! భద్రత నీ హక్కు.
సహజీవన హక్కు
గృహ హింస చట్టం-2005ను అనుసరించి మహిళ తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయవచ్చు. అది చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. అలా కలిగిన సంతానమూ న్యాయ సమ్మత మైనదే. తండ్రి ఆస్తులపై పూర్తి హక్కును కలిగి ఉంటారు. మహిళా! నీ జీవితం నీ హక్కు.
ఆస్తిలో సమాన వాటా హక్కు
హిందూ వారసత్వ చట్టం-1956 ప్రకారం కుటుంబ ఆస్తులపై మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయి. తన వాటాను తాను పొందవచ్చు. మహిళా! నీ ఆస్తి నీ హక్కు.
సమాన వేతన హక్కు
సమాన పారితోషిక చట్టం- 1976 సమానమైన పనికి సమానమైన వేతనం చెల్లించాలని స్పష్టంగా పేర్కొంటున్నది. మహిళ అన్న కారణంగా తక్కువ వేతనాన్ని ఇవ్వడం నేరం. మహిళా! శ్రమకు తగిన ప్రతిఫలం నీ హక్కు.
ప్రసూతి ప్రయోజనాల హక్కు
ఏ సంస్థ కూడా గర్భిణిని ఉద్యోగం నుంచి ఉన్నపళంగా తీసేయకూడదు. అలా చేస్తే గరిష్ఠంగా మూడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రసూతి ప్రయోజనాలను తిరస్కరించడానికీ వీల్లేదు. పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు కూడా 12 వారాలపాటు ప్రసూతి సదుపాయాలు పొందే వెసులుబాటు ఉంది. మహిళా! మాతృత్వం నీ హక్కు.
ఫిర్యాదు చేసే హక్కు
యూనిఫాం ధరించినా, ధరించకపోయినా ఏ పోలీసు అధికారి అయినా అన్ని వేళలా డ్యూటీలో ఉన్నట్టేనని పోలీసు చట్టం-1861 స్పష్టం చేస్తున్నది. ఆ సమయానికి తాను విధుల్లో లేను కాబట్టి, సహాయం చేయలేనని ఏ పోలీసు అధికారీ చెప్పకూడదు. ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్-166ఎ కింద పోలీసు అధికారి ఎఫ్ఐఆర్ దాఖలుకు కూడా తిరస్కరించ కూడదు. ఒకవేళ అలా చేస్తే, ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మహిళా! ఫిర్యాదు నీ హక్కు.