e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News హైద‌రాబాద్‌లో దిగుడుబావుల‌కు పున‌ర్వైభ‌వం..

హైద‌రాబాద్‌లో దిగుడుబావుల‌కు పున‌ర్వైభ‌వం..

Hyderabad | నగరంలో చారిత్రక దిగుడు బావుల పునరుద్ధరణకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు సంయుక్తంగా నడుంబిగించాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 44 దిగుడు బావుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ఇప్పటికే ఆరు చోట్ల పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఇందులో భాగంగానే బాపూఘాట్‌, గచ్చిబౌలి, గుడిమల్కాపూర్‌, శివంబాగ్‌, బన్సీలాల్‌పేట, సీతారాంబాగ్‌లో పనులు తుది దశకు చేరుకుని పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మరో 34 చోట్ల బావుల పునరుద్ధరణ పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా జీహెచ్‌ఎంసీతో పాటుగా పలు సంస్థలు సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ) కింద భాగస్వామ్యమవుతూ బావుల నిర్వహణ, ఆక్రమణ తొలగింపు, బావుల చుట్టూ పారిశుద్ధ్యం పనులు చేపడుతున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన శతాబ్దాల కాలం నాటి బావిలో నీరు ఉన్నప్పటికీ వినియోగించకపోవడంతో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయి చెత్తకుప్పలా దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ బావుల పునరుద్ధరణకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

బాపూఘాట్‌లోని మెట్లబావి..

మెహదీపట్నం: లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌లోని పురాతన బావిని ప్రభుత్వం పునరుద్ధరించింది. మరమ్మతులు చేసి సర్వాంగ సుందరంగా మార్చింది. ఈ పురాతన బావిని మంత్రి కేటీఆర్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌తో కలిసి ఇటీవలె పరిశీలించారు. అనంతరం బావిలో రెండు తాబేళ్లను కూడా మంత్రి కేటీఆర్‌ వదలటం గమనార్హం.

శివ్‌బాగ్‌ బావికి నూతన సొబుగులు

- Advertisement -

కార్వాన్‌ : గుడిమల్కాపూర్‌లోని శివ్‌బాగ్‌ మెట్ల బావికి దాదాపు 300 ఏండ్ల చరిత్ర ఉంది. రాజుల కాలంలో శివాలయం పక్కన నిర్మించిన ఈ బావి లింగాకారంలో ఉంటుంది. శివాలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ కూడా పూజలు చేస్తారు. ప్రస్తుతం ఇది మహేష్‌ చంద్‌ సంరక్షణలో కొనసాగుతుంది. గత జనవరిలో తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ పర్యటించి బావి శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టి శివ్‌బాగ్‌ బావిలో పేరుకుపోయిన నాచు, చెత్త ను తొలగించడంతో బావి పరిశుభ్రంగా మారింది. ఈ బావికి నూతన శోభను తెచ్చే పనిలో ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది.

నాగన్నకుంట మెట్లబావి పునరుద్ధరణ

బన్సీలాల్‌పేట్‌ : బన్సీలాల్‌పేట్‌లోని నల్లపోచమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న 300 ఏండ్ల నాటి నాగన్నకుంట మెట్ల బావి పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బావిలో పేరుకుపోయిన చెత్తా చెదారం, వ్యర్థాలను తొలగించే పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఇందులో ‘ది రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌’, ‘సాహి’ అనే స్వచ్ఛంద సంస్థ వలంటీర్లు సహకారం అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాస్‌ రెడ్డి పర్యవేక్షణలో మట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. మూడు అంతస్తులలో ఉన్న ఈ బావిలో మెట్లు, అందమైన శిల్పాలు, ఆకట్టుకునే రాతి నిర్మాణాలు ఉన్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఈ బావి అప్పట్లో పరిసర ప్రాంత ప్రజలకు తాగునీరు అందించింది. నిజాం సర్కారు సిబ్బంది ఇక్కడికి సమీపంలో డంగు సున్నం తయారుచేసే వారని, దానికి ఈ బావి ద్వారా నీటిని వాడుకునేవారు. అలాగే, నిజాం సర్కారులో వారు వాడే గుర్రాలు ఇక్కడే విశ్రాంతి తీసుకుని, బావిలోని నీటిని తాగించేవారని స్థానికులు చెబుతుంటారు.

భూగర్భజలాల సంరక్షణకు బావుల పునరుద్ధరణ

హైదరాబాద్‌ నగర సంస్కృతి, సంప్రదాయాలకు, నీటి వనరులకు పురాతన ఆనవాళ్లు బావులు. కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న నగరంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయే పరిస్థితులు లేవు, కృష్ణ, గోదావరి జలాలపై ఎంతకాలం ఆధారపడుతాం. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలను మిళితం చేస్తూ ముందుకు సాగాల్సిన అవశ్యకత ఉంది. ఇందుకోసం ది రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు, సాహిల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో చారిత్రక బావిల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నాం.

– కల్పనా రమేశ్‌, ది రెయిన్‌ వాటర్‌ ,ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు

నాటి గచ్చిబావి.. నేటి గచ్చిబౌలి

శేరిలింగంపల్లి : హైదరాబాద్‌ను పాలించిన కులీకుతుబ్‌ షా కాలంలో మూడో నిజాం ఈ మెట్ల బావిని తవ్వించాడు. మజీద్‌ ఏ దిలావర్‌ షా బేగం పక్కనే దీనిని గచ్చు సున్నం, రాళ్లతో నిర్మించడంతో దీనికి గచ్చిబావిగా పేరొచ్చింది. నిజాం నవాబుల కాలంలో నిండా నీటితో కళకళలాడిన ఈ బావి గచ్చిబౌలి పరిసర ప్రాంతాల వారికి ప్రధాన ఆధారంగా నిలిచింది. 2020లో ది రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు, సాహిల సంయుక్త ఆధ్వర్యంలో చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌ సౌజన్యంతో కల్పనారమేశ్‌ దీని పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీనిని ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, టీడబ్లుర్‌డీసీ ఛైర్మన్‌ వీ.ప్రకాశ్‌లు ప్రారంభించారు.

ప్రేమకు చిహ్నం.. పార్థివాడ మెట్లబావి

పహాడీషరీఫ్‌ : గోల్కొండను పాలించిన 6వ నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌, అమీరాబాయిల ప్రేమకు చిహ్నంగా బాలాపూర్‌ మండలం జల్‌పల్లి మున్సిపాలిటీ కేంద్రంలో పార్థీవాడ (పిట్టలవాడ)లో పురాతన మెట్ల బావి నిర్మించారు. సుమారు 400 ఏండ్ల కిందట నిజాం కాలంలో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్టాల్లో పార్థి తెగకు చెందిన వారు హైదరాబాద్‌లో స్థిరపడడానికి వచ్చారు. ఇందుకు నిజాం రాజు ఒప్పుకోలేదు. దీంతో తమ కులానికే చెందిన అమీరాబాయిని ఉత్తరప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి తమ ప్రతినిధిగా నిజాం రాజుతో మాట్లాడాలని పంపించారు. ఆమె మాటతీరు, అందానికి ఆకర్షితుడైన నిజాం ప్రభువు పార్థీలను హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇచ్చాడు. తను ఇష్టపడ్డ అమీరాబాయికి ప్రేమకు చిహ్నంగా పార్థీవాడలోనే ఓ మెట్ల బావిని తవ్వి.. అందమైన నివాసయోగ్యంగా ఉండే విధంగా భవనం నిర్మించాడు నిజాం రాజు. ఈ మెట్ల బావిలోనే ఆమె నివాసం ఉండేదని, తరుచూ నిజాం రాజు ఇక్కడికి వచ్చేవాడని గ్రామస్తులు కథలుగా చెప్పుకుంటారు. నాడు పార్థీవాడలో తాగునీటికి, సాగునీటికి మెట్ల బావి ఎంతగానో ఉపయోగపడేది.

పునరుద్ధరించే బావులు ఇవే

 • ఇఫ్ల్యూ క్యాంపస్‌ వెల్‌
 • నానక్‌రాం గూడ వెల్‌
 • సీతారాం బాగ్‌ టెంపుల్‌ కంపౌండ్‌
 • బాడి బౌలీ, కుత్భుషాహీ టూంబ్స్‌ కాంప్లెక్స్‌
 • రాయదుర్గం, లక్ష్మణ్‌ బాగ్‌
 • ఫలక్‌నుమా బస్‌ డిపో
 • మహాలాక్యూ చాంద్‌బాయ్‌ టూంబ్‌
 • పిరాన్‌బౌలి
 • హెచ్‌పీఎస్‌ బౌలి
 • గుడిమల్కాపూర్‌ శ్వేతానంబర్‌ టెంపుల్‌
 • కార్వాన్‌ , రాజా భగవాన్‌దాస్‌ మహల్‌
 • డెక్కన్‌ కాలేజీ
 • హయత్‌భక్షి బేగం మోక్యూ
 • సరూర్‌నగర్‌ రామాలయం
 • రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌
 • నిజాం కాలేజీ
 • రాంబాగ్‌ రోడ్‌ రామాలయం
 • కాశీబుగ్గ టెంపుల్‌, కిషన్‌బాగ్‌
 • కిషన్‌బాగ్‌, మురళీ మనోహర్‌ స్వామి టెంపుల్‌
 • కర్మాన్‌ఘాట్‌ ఆంజనేయ స్వామి టెంపుల్‌
 • సాలార్జంగ్‌ మ్యూజియం
 • మౌలాలీ, మజీద్‌
 • దేవీ బాగ్‌
 • శ్రీ కాళికాదేవి టెంపుల్‌
 • చిత్రగుప్త టెంపుల్‌
 • భత్‌జీ బాపు మహరాజ్‌
 • జహనుమా స్వేరోస్‌ చర్చి
 • ఎల్బీనగర్‌ ఎన్టీఆర్‌ నగర్‌
 • పైగా టూంబ్స్‌
 • హుస్సేనీ ఆలం
 • అనంతగిరి కాల హనుమాన్‌ టెంపుల్‌
 • జగదీశ్‌ మందిర్‌
 • టౌలీ మజీద్‌
 • దారుల్‌ ఉల్‌ం

సంరక్షణ అందరి బాధ్యత

చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. వారసత్వ కట్టడాల సంరక్షణ, పునరుద్ధరణ ప్రతి ఒక్కరి బాధ్యత. వారసత్వ సంపదను కాపాడుకోవడంపై పిల్లలకు ఈ కార్యక్రమం ద్వా రా బలంగా తెలుస్తుంది. ఇలాంటి వాటిలో పాల్గొనడం, కట్టడాల పునరుద్ధరించడం గర్వంగా భావిస్తున్న. కార్పొరేట్‌ సంస్థలు, పాఠశాలలు బావుల పునరుద్ధరణకు సంకల్పించారు. పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి వాటి విశిష్టతలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– అర్వింద్‌కుమార్‌, పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ

చారిత్రక బావులను పరిరక్షిస్తాం

చారిత్రాత్మక సంపద, పురాతన కట్టడాల పరిరక్షణ, బావుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్‌ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. బన్సీలాల్‌పేటలో స్థానికులు ఈ బావిలోని నీటిని అనేక రకాలుగా వినియోగించే వారు. కాలక్రమేణా చెత్తా చెదారం వేయడంతో పూర్తిగా మూసుకుపోయి, నిరుపయోగంగా మారింది. స్థానికుల కోరిక మేరకు బావి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాం. భావితరాలకు చరిత్రను తెలియజేసే ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది.

– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement