హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (ట్రిపుల్ ఐటీ) ఏడాది కాలపరిమితితో ల్యాంగ్వేజ్ ఫెలోషిప్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెస్, మెషిన్ ట్రాన్స్లేషన్ ఆధారంగా విద్యా సంస్థలోని నిపుణులతో బోధిస్తారు. దేశంలోని అరుదైన భాషల్లోని అంశాలను కంప్యూటరీకరణ ద్వారా ఇతర భాషల్లోకి మార్పు చేసేలా ఈ ప్రాజెక్టును త్రిబుల్ ఐటీ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ల్వాంగేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందు భాషిణి పేరుతో వెబ్సైట్ను ఏర్పాటు చేసి భాషలపై పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులో చేరాలనుకొనేవారు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని త్రిబుల్ ఐటీ నిర్వాహకులు తెలిపారు.