నిర్మల్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ఖరారు చేసిన నేపథ్యంలో వ్యాపారులు టెండర్ వేయాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు. దరఖాస్తు ఫీజు భారీగా పెంచిన కారణంగా వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ నేల చూపు చూడడంతో మార్కెట్లో డబ్బులు రొటేషన్ లేదు. ఇతర వ్యాపారాలు కూడా పెద్దగా నడవకపోవడంతో వ్యాపారులు నష్టాల బాటలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో మద్యం టెండర్లకు ఆశించిన స్పందన రావడం లేదు. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న దరఖాస్తు ఫీజు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.3 లక్షలకు పెంచింది. దీంతో కొత్తగా వ్యాపారంలోకి వద్దామనుకునే వారు ముందుకు వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. రెండేళ్ల క్రితం వరకు వైన్ షాపులు దక్కించుకున్న వారు లాభాలు ఆర్జించడంతో 2023 ఆగస్టులో నిర్వహించిన టెండర్లలో రెగ్యులర్ వ్యాపారులే కాకుండా సాధారణ ప్రజలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2023లో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. 2021 నుంచి 2023 కాల పరిమితికి నిర్వహించిన టెండర్లలో జిల్లా వ్యాప్తంగా 636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.12.72 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే గత సీజన్లో అంటే 2023-2025 కాలపరిమితికి గాను 1,067 దరఖాస్తులు రాగా, రూ.21.34 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల కాలపరిమితి ఈ ఏడాది డిసెంబర్ నెలతో గడువు ముగుస్తుండగా ప్రభుత్వం మూడు నెలల ముందే టెండర్లను ఆహ్వానించింది.
గత నెల 26 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 18తో స్వీకరణ గడువు ముగియనున్నది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభమై 18 రోజులు గడిచినా ఇప్పటి వరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కేవలం 22 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా, ఇప్పటి వరకు నిర్మల్ ఆబ్కారీ శాఖ కార్యాలయ పరిధిలో 14 దరఖాస్తులు.. భైంసా కార్యాలయ పరిధిలో ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి.
స్పందన కరువు
నిర్మల్, భైంసా, ఖానాపూర్ లాంటి ప్రధాన పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో విచ్చల విడిగా దాబాలు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తుండడం వల్ల వైన్స్తోపాటు బార్లలో గతంలో కంటే బిజినెస్ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు ఫంక్షన్ హాళ్లలో జరిగే శుభకార్యాలకు నిజామాబాద్, హైదరాబాద్ వంటి నగరాల నుంచి మద్యం దిగుమతి చేసుకొని విందులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కోట్ల రూపాయలు పెట్టి దుకాణాలు దక్కించుకున్న మద్యం వ్యాపారులు నష్టపోవాల్సి వచ్చింది.
ఇలా అనేక కారణాల వల్ల దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య పెంచేందుకు అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దరఖాస్తుదారులకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాలు అప్పగిస్తారు. ఆయా దుకాణాలు 2027 నవంబర్ 30 వరకు కొనసాగుతాయి. ఈ సారి కూడా గతంలో మాదిరిగానే మద్యం టెండర్లలో పాత రిజర్వేషన్ల పద్ధతి కొనసాగనున్నది. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం షాపులను కేటాయించనున్నారు.