సాధారణంగా దోషులను శిక్షించడానికి చట్ట ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ ఇసుక అక్రమ రవాణాలో మాత్రం ఆ దోషుల ముందే తప్పటడుగులు వేస్తున్నారు. వారే సాక్ష్యంగా తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. ఇసుక వేలం వేయకుండానే వేసినట్టు పేపర్‌పై చూపుతున్నారు. 5వేల ఆదాయం వచ్చినట్టు చలానాను ఏకంగా కోర్టులో సమర్పిస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు, జమ్మికుంట కేంద్రంగా నడుస్తున్న ఇసుక బాగోతం! దోషుల ముందే అధికారులు తప్పుడు పద్ధతులు పాటిస్తుండడంతో ఇదే అదనుగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయలోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్రమ రవాణాదారులు మరోసారి తప్పు చేసినా.. చర్యలు తీసుకునే అధికారాన్ని కోల్పోయే పరిస్థితులు కొంత మంది అధికారులే సృష్టిస్తున్న వైనం విమర్శలకు తావిస్తున్నది. జమ్మికుంట కేంద్రంగా సాగుతున్న ఇసుక అక్రమ దందాపై ‘పట్టుకున్న ఇసుక మాయం?’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం అధికార వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంపై తీగలాగితే డొంకంతా కదులుతుండగా, అక్రమార్కుల ముందే అధికారులు తప్పులు చేస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది.
Manair | కరీంనగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జమ్మికుంట : జమ్మికుంట మండల కేంద్ర పరీవాహక ప్రాంతాన్ని ఆనుకొని వెళ్తున్న మానేరు వాగులో నాణ్యమైన ఇసుక లభ్యం అవుతున్నది. నిజానికి ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి ఇసుకకు డిమాండ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో మానేరుకు ఇరువైపు గ్రామాల నుంచి దందా సాగడం సర్వసాధారణమైంది. పోలీసులు, రెవెన్యూ, అప్పుడప్పుడు మైనింగ్ అధికారులు దాడులు చేయడం, పట్టుకోవడం, జరిమానాలు విధించడం.. ఆ తర్వాత మళ్లీ కొద్దిరోజులకు దందా సాగడం ఇక్కడ రివాజుగా మారింది. దీనిని అరికట్టేందుకు జమ్మికుంట పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
నిబంధనల ప్రకారం ఇసుక అక్రమ ట్రాక్టర్లను పట్టుకొని, అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సుమారు 90 ఇసుక అక్రమ ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిపై నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసి, కోర్టుకు పంపించారు. అయితే ఇసుక అక్రమ ట్రాక్టర్ల విషయంలో పోలీసులు రెండు రకాలుగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని నిబంధనలు చెబుతున్నాయి. అందులో మొదటిది ఇసుక అక్రమ ట్రాక్టర్లను పట్టుకొని, వాటిని సంబంధిత తహసీల్దార్‌కు అప్పగిస్తారు. ఆ మేరకు తహసీల్దార్ మొదటి సారి పట్టుబడితే సదరు ట్రాక్టర్‌కు 5వేల జరిమానా విధిస్తారు. అదే రెండోసారి పట్టుబడితే 10వేల జరిమానా వేయాలి. మూడోసారి అయితే ఏకంగా సీజ్ చేయాలి.
తహసీల్దార్లు ఆ మొత్తాన్ని చలానా రూపంలో కట్టించి, ఆ డబ్బులను ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. అలాగే పట్టుబడిన ఇసుకను అన్లోడింగ్ చేసి, వేలం వేస్తారు. దాదాపు ఒక క్యూబిక్ మీటర్‌కు 600 చొప్పున ట్రాక్టర్ ఇసుకకు సుమారు 1800 వచ్చేలా చర్యలు తీసుకుంటారు. అలా వచ్చిన సొమ్మును సైతం ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. జరిమానా చెల్లించిన తర్వాత రెవెన్యూ అధికారులు సదరు ట్రాక్టర్లను విడుదల చేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే జరుగుతున్నది. ఇక రెండో పద్ధతి చూస్తే పోలీసులు ఇసుక అక్రమ ట్రాక్టర్లను పట్టుకొని నేరుగా ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు జమ్మికుంట పోలీసులు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. కానీ, ఇక్కడే రెవె న్యూ, పోలీస్ యంత్రాంగం మధ్య సమన్వయలోపం ఇసుకాసురులకు కలిసి వస్తున్నది.
దోషుల ముందే తప్పుడు పత్రాల సృష్టి?
సుమారు 90 అక్రమ ఇసుక ట్రాక్టర్లను జమ్మికుంట పోలీసులు పట్టుకున్నారు. ఆ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపించారు. దాంతో కోర్టు పలు ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను నిశితంగా పరిశీలిస్తే.. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్‌ను తహసీల్దార్ పరిగణలోకి తీసుకొని, ఆ ఇసుకను డంప్ చేసి, దానికి వేలం వేసి, వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి. అందుకు సంబంధించిన చలానాను కోర్టులో సమర్పించాలి. ఉత్తర్వుల్లో ఈ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కానీ, జమ్మికుంటలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇసుక ట్రాక్టర్ తహసీల్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉన్నా వెళ్లడం లేదు. ఇసుక డంప్ కావడం లేదు. అధికారికంగా వేలం జరగడం లేదు కానీ, జరిగినట్టు రెవెన్యూ వ్యవస్థ నుంచి రికార్డులు సృష్టించబడుతున్నాయి. దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన దోషి ముందే అధికారులు తప్పుడు పద్ధతులకు పాల్పడుతున్నారు. ఆ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు, ఇసుకను వేలం వేసినట్టు, అందుకు 5వేల ఆదాయం వచ్చినట్టు చూపుతూ చలానా కోర్టుకు సమర్పిస్తున్నారు. ఇదంతా కాగితాలపై నడుపుతున్నారే తప్ప నిజానికి ఇక్కడ ఏ నిబంధనలు అమలు కావడం లేదు.
కాగితాలపైనే వేలం!
వేలం వేసేందుకు కొన్ని నిబంధనలున్నాయి. ఇసుక వేలం వేయాలంటే ముందుగా పత్రిక ప్రకటన ఇవ్వాలి. అందుకు సంబంధించిన ఫొటోలను జాగ్రత్త పరచాలి. ఎవరి పర్యవేక్షణలో వేలం జరిగిందో చూపెట్టాలి. కానీ, అందులో ఏ ఒక్క నిబంధన అమలు కావడం లేదు. అయితే పేపర్‌పై మాత్రం అన్నీ పాటిస్తున్నట్టు పత్రాలు సృష్టిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఇసుక అక్రమ రవాణాదారు ముందే ఈ తప్పుడు పద్ధతులను అధికారులు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా సదరు ఇసుకను అదే ట్రాక్టర్ యజమానికి లేదా అతడి దగ్గరి వారికి వేలం ద్వారా అమ్మినట్టు చూపి, అతడి ద్వారా 5వేల చలానా కట్టించి, దానిని కోర్టుకు సమర్పించి స్టేషన్ నుంచి ట్రాక్టర్లను తీసుకెళ్తున్నారు.
అంటే పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న ట్రాక్టర్లలో ఇసుక అలాగే ఉంటుంది. వారు ఎక్కడో ఓచోట అమ్ముకుంటున్నారు. పట్టుకున్న ట్రాక్టర్ల న్నీ ఇసుకతో పోలీసుల కండ్ల ముందు నుంచే బయటకు వెళ్తున్నాయి. జరుగుతున్న తతంగాన్ని నిశితంగా పరిశీలిస్తే.. రెవె న్యూ, పోలీస్ అధికారులు సమన్వయలోపంతో తీసుకుంటున్న చర్యలు ఇసుక అక్రమ రవాణాదారులకు అండగా నిలుస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీనిని లోతుగా చూస్తే.. అధికారులు గుట్టుగా ఎలా అండగా నిలుస్తున్నారో అర్థమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైకిచూస్తే అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం పెద్ద బాగోతమే నడుస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు లోతు గా విచారణ జరిపితే భవిష్యత్‌లో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోకుండా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శాఖల మధ్య లోపం!
అధికారులు అనుసరిస్తున్న తప్పుడు పద్ధతుల వల్లే ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా చేసుకునే అవకాశం దోషులకు ఉంటున్నదన్న విమర్శలున్నాయి. ఎందుకంటే వారి ముందే తప్పుడు నివేదికలు తయారు చేస్తున్న నేపథ్యంలో పోలీసులన్నా.. రెవెన్యూ అధికారులన్నా భయం ఉండడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే కోర్టు ఉత్తర్వులు ప్రకారం రెవెన్యూ అధికారులు విధిగా ట్రాక్టర్‌ను తమ ఆధీనంలోకి తీసుకొని ఇసుక వేలం వేయాలి. ఇదే సమయంలో పోలీసులు సహకరించాలి. కానీ, ఈ విషయంలో రెండు శాఖల మధ్య సమన్వయం లోపించందన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ట్రాక్టర్ పట్టుబడితే పెద్దగా పోయేదేముంది? 5వేల చలానా కడితే చాలన్న అభిప్రాయమే ఇసుకాసురుల్లో ఉందని తెలుస్తున్నది. ఇప్పటికైనా రెండు శాఖలు ఒక్క తాటిపైకి వచ్చి, నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్తే ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అవకాశముంటుంది. అయితే తమ కార్యాలయానికి ఇసుక ట్రాక్టర్లును పోలీసులు పంపడం లేదని, చలానా వస్తే తీసుకుంటున్నామని తహసీల్దార్ రమేశ్‌బాబు ధ్రువీకరించిన విషయం తెలిసిందే.
తహసీల్దార్ మమ్మల్ని అడగలేదు : జమ్మికుంట సీఐ రవి
జమ్మికుంట కేంద్రంగా జరుగుతున్న ఇసుక దందాపై జమ్మికుంట సీఐ రవి స్పందించారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ‘మేం పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ కార్యాలయానికి పంపాలని జమ్మికుంట తహసీల్దార్ మమ్మల్ని కోరలేదు. అయన అడిగితే పంపేవాళ్లం. కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నాం. దీని వల్ల భవిష్యత్‌లో వారికి శిక్ష పడే అవకాశముంటుంది. తద్వారా వారు భయపడి అక్రమ దందా మానుకుంటారన్న ఉద్దేశంతో ఈ తరహా చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. అలాగే ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా 5వేల చలానా కట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.