జోగులాంబ గద్వాల : రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈనెల 13న జోగులాంబ గద్వాల ( Gadwal ) జిల్లాకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్( BRS working President) కేటీఆర్ ( KTR ) పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy), శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పిలుపునిచ్చారు.
కేటీఆర్ గద్వాల పర్యటన పై నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే విజయుడు ,స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్‌తో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ పర్యటన సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభ, రోడు షోను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.
గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్,మాజీ జడ్పీటీసీ లు,మాజీ కౌన్సిలర్లు , కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరనున్నారని వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ము ,ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు.
ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలయ్యాక హామీలను తుంగలో తొక్కి రైతులను,కార్మికులను,ఉద్యోగులు అన్నీ వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పదేండ్ల కాలంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతులకు కన్నీళ్లు రాకుండా కాపాడుకున్నారని, అన్నీ వర్గాల ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేసి కష్టాలను రూపుమాపారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ యూరియా సమస్య రానీయకుండా పాలన చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను రోడ్డుమీదకు తీసుకువచ్చిందని ఆరోపించారు. బీజేపీ,కాంగ్రెస్‌కు చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే ఏ ఒక్క రోజు రైతుల కష్టాలు, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్రం చేసే పనులకు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు,మాజీ సర్పంచులు,పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.