చెల్లని నాణేనికి గీతలెక్కువ.. చేతగాని కాంగ్రెస్ నేతలకు మాటలెక్కువ. అందుకే జూపల్లి మొదట తెలంగాణ భవన్‌కు వస్తా అన్నడు. తర్వాత గన్‌పార్క్‌కు రమ్మన్నడు. అక్కడికి వెళ్లబోయిన నన్ను పోలీసులు అడ్డుకున్నరు. రేపు కొల్లాపూర్‌కు రమ్మంటడు. అయినా పారిపోయేటోళ్లు చెప్తే ఎట్ల నమ్మాలె? నిద్రపోయిన వాడిని లేపవచ్చు, కానీ నటించేవాడిని ఎట్ల లేపుతం?
– కేటీఆర్
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): తొడగొట్టి సవాళ్లు విసరడం, వెన్నుచూపి పారిపోవడం ముఖ్యమంత్రి, మంత్రులకు మొదటి నుంచీ అలవాటేనని.. అందుకే చర్చలకు రాకుండా సిగ్గులేకుండా తోకముడిచి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చించే దమ్ములేకనే డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారని.. పారిపోతే వదిలిపెట్టబోమని ప్రతిపక్షంగా గట్టిగా నిలదీసి ప్రజాక్షేత్రంలో కడిగిపారేస్తామని తేల్చిచెప్పారు. పదేండ్లలో నికార్సైన పాలన అందించి తెలంగాణను నిటారుగా నిలబెట్టిన బీఆర్ఎస్తో చర్చించే దమ్మూధైర్యం కాంగ్రెస్ పిరికిపందలకెక్కడిదంటూ నిప్పులుచెరిగారు. చర్చించేందుకు బయల్దేరిన బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావును పోలీసులతో అడ్డుకొని హైడ్రామా నడిపించారని మండిపడ్డారు. మంత్రి జూపల్లి కోసం గురువారం తెలంగాణ భవన్లో ప్రత్యేక కుర్చీవేసి, స్వాగతం పలికేందుకు పూలబొకే తెచ్చి, సత్కరించేందుకు శాలువా తీసుకొచ్చి మూడు గంటలు ఎదురుచూస్తే చర్చకు రాకుండా ముఖంచాటేశారని ధ్వజమెత్తారు. గన్‌పార్క్ వద్దకు వస్తానని చెప్పి బయల్దేరిన తనను పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరకు కంచన్‌బాగ్ ఠాణాకు వెళ్లి అరెస్టయిన బీఆర్ఎస్ నాయకులను పరామర్శించేందుకు కూడా అనుమతించలేదని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. సవాళ్లు విసిరి పారిపోయిన మంత్రుల బాగోతాన్ని రాష్ట్ర ప్రజలందరూ కండ్లారా చూశారని.. సచివాలయం, గాంధీభవన్‌లో కూర్చొని సవాళ్లు విసరడం.. పోలీసులను పెట్టి తమను అడ్డుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు.
సీఎం రేవంత్‌రెడ్డి ధైర్యముంటే రెండేండ్ల పాలన, హామీల అమలుపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమకు మైక్ కట్ చేయకుండా 2 గంటలు అవకాశమిస్తే కాంగ్రెస్ సర్కార్ అక్రమాలు, అరాచకాలు, బాగోతాలు, వైఫల్యాలను బట్టబయలు చేస్తామని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెచ్చిన అప్పులు కేవలం రూ.2.80 లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్ మరోమారు స్పష్టంచేశారు. ఇవి తాను చెబుతున్న లెక్కలు కావని కాగ్ తేల్చిన నిజానిజాలని తెలిపారు. అప్పులపై గతంలోనూ హరీశ్‌రావు అసెంబ్లీ సాక్షిగా నిగ్గుతేల్చినా కాంగ్రెస్ మంత్రులకు సోయి రాకపోవడం సిగ్గుచేటని దెప్పిపొడిచారు. కాగ్ లెక్కలను పక్కనబెట్టి రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క కాకిలెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే మరోసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టి అప్పులపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ధైర్యముంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
ఎవరి పాలనలో ఎవరేం చేశారో చర్చిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ హయాంలో తెచ్చిన అప్పులపై తేల్చుదామని మంత్రి జూపల్లి.. గురుకుల టెండర్లలో అక్రమాలు జరుగలేదని, నిజానిజాలు బట్టబయలు చేస్తామని అమాత్యులు అడ్లూరి, పొన్నం, అజారుద్దీన్ సవాళ్లు విసిరారు. దమ్ముంటే రమ్మన్నారు, తొడగొట్టారు, హూంకరించారు. కానీ ఆధారాలతో చర్చకు సిద్ధమైన మమ్మల్ని చూసి తోకముడిచారు.
– కేటీఆర్
కేసీఆర్ పాలనలో పచ్చబడ్డ తెలంగాణను కాం గ్రెస్, బీజేపీ తమ చీకటి రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతున్నదని ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్‌షా చెబుతున్నా ఏడాదికాలంగా చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుతున్నారని నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఈడీ దాడుల వ్యవహారం ఏమైందో? విచారణ ఎప్పుడు జరుగుతుందో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమృత్ టెండర్లలో సీఎం బావమరిది సృజన్‌రెడ్డి అవినీతిపై ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలకు కాంగ్రెస్ సర్కార్ కాంట్రాక్టులు ఇస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.
గతంలో నోట్లకట్టలతో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌కు రాష్ట్రంలో విశ్వసనీయత లేదని కేటీఆర్ మండిపడ్డారు. మంత్రి పొంగులేటి కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పొంగులేటి కొడుకు వట్టినాగులపల్లిలో కంపెనీలపై పడి భూదోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు చేయకుండా ధోకా చేసిందని దుయ్యబట్టారు. దగాకోరు సర్కార్‌పై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి అన్నదమ్ముల అరాచకాలకు అంతులేకుండా పోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. 30నెలల్లో రాష్ర్టాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ప్రజలు అధోగతి పాలవుతుంటే అనుముల బ్రదర్స్ ఆస్తులు అదానీని మించిపోతున్నాయని ఆరోపించారు. అమాయకులను బెదిరించి భూములు గుంజుకుం టూ ఆస్తులు పొగేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎైక్సెజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల వ్యవహారంలో మంత్రి జూపల్లి కొడుకు, సీఎం రేవంత్ అల్లుడి పంచాయితీ భరించలేక సిన్సియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామా చేశా రు. జూపల్లికి బీర్ల కోసం తెచ్చిన జీవోపై అవగాహన లేదంటూ చురకలంటించారు. కానీ సీఎం మెప్పు కోసమే సవాళ్ల పేరిట బూటకపు డ్రామాలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్ రావాలని రేవంత్‌రెడ్డి సవాల్ చేస్తున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘రేవంత్స్థాయికి కేసీఆర్ ఎందుకని? మేం సరిపోతాం..’ అని చెప్పారు. తమనే ఎదుర్కోవడం చేతగాని రేవంత్‌రెడ్డికి కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఎక్కడిదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను రమ్మని అడుగుతున్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే నాడు రాష్ట్రానికి వచ్చి అడ్డగోలు హామీలిచ్చిన రాహుల్‌గాంధీని తీసుకురావాలని కేటీఆర్ ప్రతిసవాల్ విసిరారు.