KTR | ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గ్లోబల్ వేదికలను రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు.
అంతర్జాతీయ సదస్సులు దేశ ప్రతిభను ప్రపంచానికి చూపించే వేదికలు అని కేటీఆర్ తెలిపారు. అలాంటి వేదికలపై రాజకీయ నిరసనలు చేపట్టడం వల్ల భారత్‌పై అంతర్జాతీయంగా ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ.. ఎప్పుడు, ఎక్కడ నిరసన తెలపాలన్న విషయంలో బాధ్యత అవసరమని అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలను వ్యక్తపరచడానికి సరైన సమయం, సరైన వేదిక ఉండాలన్నారు. వీటికి అంతర్జాతీయ సమ్మిట్ మాత్రం అనుకూలమైన స్థలం కాదని పేర్కొన్నారు.
ఇక ఏఐ సమ్మిట్‌లో తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేయడం చాలా విచిత్రంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఒకే వేదిక వద్ద శుక్రవారం జరిగిన ఈ రెండు సందర్భాలు రాహుల్‌గాంధీకి రేవంత్‌రెడ్డి ఏ స్థాయిలో గౌరవం ఇస్తున్నారో మరోసారి తెలియజెప్పాయి. ఏఐ సమ్మిట్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎలాగూ ఈ సదస్సుకు హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా అదే వేదిక మీది నుంచి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. సమ్మిట్‌ను రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తున్నారనే ఆలోచనే లేకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అద్భుతం.. బ్రహ్మాండం అనేలా కొనియాడారు.
ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై రేకెత్తుతున్న ఆందోళనలను రేవంత్‌రెడ్డి కొట్టిపారేశారు. అదేమంత పెద్ద సమస్య కాదని, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చుగానీ సరైన రీ-సిల్లింగ్, అప్-సిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించే కొత్త అవకాశాలు మరింత విసృ్తతంగా ఉంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం-రాష్ట్రాల సమన్వయంతో ‘ఏఐ వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
యూత్ కాంగ్రెస్ నేతలు ఒకవైపు అధికార బీజేపీ నేతల మీద ప్రతి విమర్శలు చేస్తూనే మరోవైపు రేవంత్‌రెడ్డికి తలంటుతున్నారు. జాతీయ కాంగ్రెస్ విధానం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ సీఎంగా రేవంత్ వేదిక మీద ప్రసంగించింది ఏమిటీ? అని వారు మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి మీద తమ అధినేత రాహుల్‌గాంధీ కంటే పక్కన ఉన్న చంద్రబాబు ప్రభావమే ఎక్కువగా కనిపిస్తున్నదంటూ పేరు చెప్పటానికి ఇష్టపడని యూత్ కాంగ్రెస్ నేత ఒకరు మీడియాతో అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు తీశారని మండిపడుతున్నారు.