KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. రక్త పిశాచీ అంటూ మండిపడ్డారు. ఇంకా తీరలేదా మీ రక్తదాహం ? 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా.. సరిపోలేదా? తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు అంటూ కాంగ్రెస్ నాయకులపై కేటీఆర్ మండిపడ్డారు. 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు.. 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు.. మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..! కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై అని వ్యాఖ్యానించారు. నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు అని సూచించారు.
పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లమని తెలిపారు. నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తామని తెలిపారు. మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండని సూచించారు.