ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అన్నదాతలు బలవుతున్న ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ధాన్యం కుప్పల మీదే రైతన్నలు కుప్ప కూలుతున్నారని.. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని విమర్శించారు. రైతులు రాలిపోతున్న ఈ రాక్షస పాలనలో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నావా.. ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు.
కొనుగోలు కేంద్రాల కాడ మండుటెండల్లో రైతుల గుండెలు ఆగిపోతున్నా ఈ కర్కశ ప్రభుత్వానికి కనికరం కలగడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. పంటలు కొనకుండా ఇంకెంత కాలం
యాతన పెడతారని మండిపడ్డారు. ఇంకెన్ని చావులు కావాలి..ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలని ప్రశ్నించారు. దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండని హితవుపలికారు. ఇకనైనా సోయి తెచ్చుకొని ..ఈ రోజు కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ధితో చర్చించండి డిమాండ్ చేశారు. పంట కొనుగోళ్లను పూర్తి చేసి. రైతన్నల తిప్పలు తప్పించాలన్నారు.