అహ్మదాబాద్: నకిలీ ఫొటోలు, డాక్యుమెంట్లతో పోలీస్ అధికారిగా ఒక వ్యక్తి నమ్మించాడు. సుమారు 21 మంది మహిళలను మోసం చేశాడు. వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. కొందరు మహిళల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (man poses as cop dupes 21 women) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. హిమాంశు అలియాస్ రాకీ పంచల్ పలు మ్యాట్రిమోనియల్, డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో రిజిస్టర్ అయ్యాడు. ఏఐ టూల్స్ సహాయంతో నకిలీ పత్రాలు, ఐడీ కార్డులు సృష్టించాడు. గుజరాత్ పోలీస్ సైబర్‌క్రైమ్ విభాగానికి చెందిన ఎస్ఐగా పలువురు మహిళలను నమ్మించాడు. ఆర్థిక ఇబ్బందులు, విధుల నుంచి సస్పెన్షన్, ఐటీ రైడ్స్‌లో బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ వంటి అసత్యాలు చెప్పి, నకిలీ లేఖలు చూపించి సుమారు 21 మంది మహిళల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు.
కాగా, అహ్మదాబాద్‌లోని నరోడా, నవరంగ్‌పురా ప్రాంతాలకు చెందిన మహిళలకు రాకీపై అనుమానం కలిగింది. వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేయగా అతడి వ్యవహారం బయటపడింది. గుజరాత్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో కూడా పలువురు మహిళలను అతడు మోసం చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నివసిస్తున్న అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు ముంబై సమీపంలోని నలసోపారా పోలీస్ స్టేషన్లో రాకీపై గతంలో ఒక అత్యాచారం కేసు నమోదైందని పోలీస్ అధికారి తెలిపారు. బెయిల్‌పై విడుదలైన అతడు మహిళలను లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగించాడని చెప్పారు. బెయిల్ ఖర్చుల పేరుతో అహ్మదాబాద్‌లోని నవ వడజ్ ప్రాంతానికి చెందిన మహిళ నుంచి రూ.50,000 తీసుకున్నట్లు తెలిసిందన్నారు. నరోడాకు చెందిన మరో మహిళ నుంచి రూ. 1.8 లక్షలు, నవరంగ్‌పురా మహిళను రూ. 80,000కు మోసగించాడని వివరించారు. ఇతర బాధిత మహిళలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.