Twisha Sharma : త్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె భర్త సమర్ధ్ శర్మకు భోపాల్ కోర్టు శనివారం ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. సమర్ధ్ శుక్రవారం కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న త్విషా శర్మ అనుమానాస్పదంగా మరణించింది. ఈ ఘటన తర్వాత నుంచి.. అంటే 10 రోజులపాటు భర్త సమర్ధ్ శర్మ పరారీలో ఉన్నాడు. తన లాయర్లతో కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టులో మొదట ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.
అనంతరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో చివరకు తన బెయిల్ పిటిషన్‌ను సమర్ద్ శర్మ వాపస్ తీసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం నాటకీయ పరిణామాల మధ్య లొంగిపోయాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి, భోపాల్ కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అనుదితా గుప్తా.. సమర్ద్ శర్మకు వారం రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇదే సందర్భంలో కోర్టులో తన పాస్‌పోర్ట్‌ను సమర్పించినట్లు త్విషా శర్మ లాయర్ అంకుర్ పాండే తెలిపారు. నోయిడాకు చెందిన త్విషా శర్మకు, లాయర్ అయిన భోపాల్‌కు చెందిన సమర్ధ్ శర్మకు గతేడాది వివాహం జరిగింది. అనంతరం త్విషా శర్మను అదనపు కట్నం కోసం వేధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 12న త్విషా శర్మ తన ఇంటిపై ఉరి వేసుకుని మరణించింది.
దీనిపై త్విష కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మరణం అనంతరం భర్త సమర్ద్ శర్మ పారిపోయాడు. సమర్ద్ శర్మ లాయర్ కాగా, అతడి తల్లి రిటైర్డ్ జడ్జి. త్విషా శర్మ మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు రెండోసారి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నలుగురు సభ్యుల వైద్య బృందం బయాప్సీ నిర్వహించనుంది. ఇటు బయాప్సీ రిపోర్ట్, అటు పోలీస్ కస్టడీలో సమర్ద్ వెల్లడించే వివరాలను బట్టి.. కేసు విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.