Ashwin : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఘోరంగా నిరాశపరిచింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సమిష్టితత్వం కొరవడి ప్లే ఆఫ్స్ ముందే ఇంటిదారి పట్టింది. దాంతో.. హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) సహా కోచింగ్ బృందంలో మార్పులు తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ రెండో సీజన్ నుంచి సీఎస్కే కోచ్‌గా కొనసాగుతున్నఫ్లెమింగ్ స్థానంలో దూకుడుగా ఆలోచించగల శిక్షకుడు అవసరమే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీ(MS Dhoni) ఉండగా కొత్త కోచ్ కోసం వెతుకులాట ఎందుకు? అని ప్రశ్నించాడు.
ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’గా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ పంతొమ్మిదో సీజన్ వేలంలో పోటీపడి కుర్రాళ్లను కొనుక్కుంది. కానీ, లీగ్ దశ ద్వితియార్థంలోనే వారికి అవకాశాలివ్వడంతో.. ఆలస్యంగా పుంజుకున్నా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. స్క్వాడ్‌లో కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్, ప్రశాంత్ వీర్ వంటి ప్రతిభావంతులున్నా వారిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం సీఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాల్ని దెబ్బతీసింది. దాంతో.. వచ్చే సీజన్‌కు ముందే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను తొలగించి.. అతడి స్థానంలో టీ20 ఆటపై అవగాహనున్న వారికి బాధ్యతలు ఇచ్చినా ఆశ్చర్యమేమీ లేదు.

అయితే.. మాజీ కెప్టెన్ ధోనీ ఉండడంతో కొత్త కోచ్‌ను ఎంపిక చేయడం సీఎస్కేకు చాలా సులభమని, మహీనే సరైనోడు అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే తదుపరి కోచ్‌గా అశ్విన్ తప్ప ఎవరిని ఎంపిక చేసినా అభ్యంతరం లేదని ఒక యూజర్ పెట్టిన పోస్ట్‌పై అశ్విన్ స్పందించాడు. ‘నేను 11 మందిని ఎంపిక చేస్తే ప్రత్యర్థి జట్టుకు మా బౌలింగ్, బ్యాటింగ్ ప్రణాళిక గురించి తెలిసిపోతుంది. అవినీతి నిరోధక శాఖ నన్ను విచారించి.. నా వైఫల్యమే కారణమని చెబుతుంది. నియమాలు కూడా తెలుసుకోవాలి అని సూచిస్తుంది. చివరగా.. ఎంఎస్ ధోని ఉండగా కోచ్‌గా ఎవరి కోసమే వెతకడం దండగ’ అని అశ్విన్ పోస్ట్ పెట్టాడు.
Absolutely agree with you!
I will announce 11 and make sure the opposition know the bowling and batting plans as well.🤝🤝
In fact, the above will ensure that the anti corruption unit will take me to task & will also ensure my own failure.
Rules Kooda theriyuma engenthu da… https://t.co/wnI4ArAy0s
— Ashwin 🇮🇳 (@ashwinravi99) May 23, 2026
ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై జట్టుకు ప్రధాన ఆకర్షణ అయిన ధోనీ.. మాజీ కెప్టెన్ మాత్రమే కాదు ఐదు టైటిళ్లు అందించాడు. పైగా ఐపీఎల్‌కు అతడు ఇంకా వీడ్కోలు పలకలేదు. పంతొమ్మిదో సీజన్లో గాయం కారణంగా ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం పలు సందేహాలకు తావించింది.

కోచ్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ధోనీ సీఎస్కేకు ఎంతో కీలకమని వ్యాఖ్యనించడం చూస్తుంటే పెద్ద బాధ్యతే అప్పగించడం ఖాయమనిపిస్తోంది. 2009లో కెప్లెర్ వెస్సెల్స్ నుంచి కోచ్‌గా వచ్చిన ఫ్లెమింగ్.. ధోనీ సారథ్యంలో చెన్నైని విజయవంతమైన జట్టుగా నిలిపాడు.