KTR | సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు గతంలో టీ-హబ్ ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుతం ‘అనుముల హబ్స్’ పేరుతో కుటుంబ ఆధారిత కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని సెటైర్ వేశారు.
నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధి కోసం టీ-హబ్‌ను నిర్మించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యుల ఆధారంగా, ఎలాంటి ఆవిష్కరణలు, ఉద్యోగులు లేకుండా ‘అనుముల హబ్స్’ను రూపొందిస్తున్నారని విమర్శించారు. అనుముల కుటుంబానికి చెందిన వారైతే తక్కువ ధరకు ప్రభుత్వ భూములు కేటాయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై ఎలాంటి ప్రశ్నలు అడగడం లేదని వ్యాఖ్యానించారు.
‘అనుముల కొండల్‌రెడ్డి’ని శతాబ్దపు గొప్ప ఆవిష్కర్తగా ప్రతిపాదిస్తున్నానంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి పెట్టుబడి లేకుండానే ‘టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే రక్షణ రంగ సంస్థను ఏర్పాటు చేసి, రాత్రికి రాత్రే కనీసం రూ.200 కోట్ల లాభం ఆర్జించారని ఆరోపించారు.
మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలోని లక్షలాది మంది యువతకు ప్రభుత్వ విలువైన భూములను వందల కోట్ల రూపాయల మేర ఎలా పొందాలో బోధించాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ‘మ్యాజిక్ ట్రిక్’ను కేవలం అనుముల కుటుంబానికే ఎందుకు పరిమితం చేయాలని ప్రశ్నించారు.