హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ అరెస్టుల విష సంస్కృతికి చరమగీతం పాడాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ సీనియర్‌నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెకించి, ఏడో గ్యారెంటీగా ‘ఎమర్జెన్సీ’ని అమలుచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తకాదని, అరెస్టులు అంతకన్నా కాదని, ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో బెదిరింపు చర్యలకు భయపడే ప్రసక్తేలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ సీనియర్‌నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఎర్రోళ్లను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా పోలీసులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బాకొట్టుకుంటూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
సెలవు రోజుల్లో కావాలని తమ నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హోంమంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి సారించారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం ఎకువ కాలం నిలవదని తేల్చిచెప్పారు. రేవంత్‌రెడ్డి పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు రేవంత్‌రెడ్డికి తెలంగాణ సమాజం తగిన బుద్ది చెప్తుందని హరీశ్‌రావు హెచ్చరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీస్తున్న వారిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తున్నదని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఖండించారు. ఇంట్లోకి దౌర్జన్యంగా పోలీసులు రావడం ఎందుకని నిలదీశారు. ఈ ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
నోటీసులు ఇవ్వకుండా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా ఎలా అరెస్టు చేస్తారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. మీరు చెప్పుకునే ఇందిరమ్మ రాజ్యం పాలన అంటే ఇదేనా? అని నిలదీశారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు.
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఖండించారు. కేసులు, నిర్బంధం, అరెస్టులు కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యంగా మారాయని విమర్శించారు. హామీలపై నిలదీస్తున్నందుకే బీఆర్ఎస్ నేతల మీద ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం కక్షపూరిత రాజకీయమేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ కక్షపూరిత చర్యలను ఖండించారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దళిత గిరిజన సోదరులకు అండగా ఉంటున్నందుకు 12 సెక్షన్ల కింద కేసు పెట్టారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఎవరూ ఇలా పెట్టలేదని తెలిపారు.
రేవంత్ ప్రభుత్వ అణచివేత, బెదిరింపు యత్నాలను న్యాయవ్యవస్థ తిప్పికొట్టిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రభుత్వ దౌర్జన్యాలకు చరమగీతం పాడిందని తెలిపారు.‘ఇది బలం కలిగిన ప్రభుత్వం కాదు. భయంతో నడిచే పాలనా అని మండిపడ్డారు.
ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా వేలాది మంది దళిత గిరిజన ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు మీరిచ్చే మర్యాద ఇదేనా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మీద కేసే అక్రమం అని, తోడుగా వెళ్లిన శ్రీనివాస్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయడం ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎన్నికల ముందు 420 హామీలపై నిలదీస్తున్నందునే బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. సర్కారు కక్షపూరిత చర్యలు సరికావని హితవు పలికారు.
ఇందిరమ్మ రాజ్యమంటే నిర్బంధపాలన అని కాంగ్రెస్ సర్కారు మరోసారి రుజువు చేసిందని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ మండిపడ్డారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్ ఏమైనా బందిపోటా? ఉగ్రవాదా? గజదొంగనా? అని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అరెస్టు చేయడమే ప్రజాపాలనా? అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించడం ఈ ప్రభుత్వంలో లేనట్టు కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అన్యాయమని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై రేవంత్సరార్ మోపుతున్న అక్రమ కేసులకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డిది ఎఫ్ఐఆర్ల సరార్గా చరిత్రలో మిగిలిపోతుందని మండిపడ్డారు.