KTR | పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ దేశంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు పెద్దగా లేవని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్, టీడీపీ రెండే 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని వెల్లడించారు.
బీఆర్ఎస్ 26వ వార్షికోత్సవం సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం వివరాలను కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలపైనా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కొత్త కమిటీలను తొందరలోనే చేస్తామని చెప్పారు. స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లో సభ్యత్వ నమోదు చేస్తామని చెప్పారు. సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటుపై చాలా పేపర్ వర్క్ జరగాల్సి ఉందని తెలిపారు.
హైదరాబాద్లో దోమలు, మంచినీటి బెడద ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో మంచినీటి కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ ఇంట్లో కూడా వాటర్ ట్యాంకర్ తెప్పించుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని విమర్శించారు. జిల్లాలవారీగా సమస్యలను గుర్తించి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలందరికీ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలపై పోరాడాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశామని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుబంధును కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంపై సమావేశంలో విస్తృతంగా చర్చించామని తెలిపారు. ధాన్యం దళారుల పాలైందని.. కొనుగోలు కేంద్రాలు పనిచేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఆంక్షలు లేకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.