e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News ఈటల, రేవంత్‌ గోల్కొండలో భేటీ.. కాదని చెప్పండి.. ఫొటోలిస్తా

ఈటల, రేవంత్‌ గోల్కొండలో భేటీ.. కాదని చెప్పండి.. ఫొటోలిస్తా

 • కాంగ్రెస్‌, బీజేపీ చీకటి ఒప్పందాలు
 • టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు
 • త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న ఈటల
 • రిసార్ట్‌లో ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం
 • జాతీయ పార్టీలకు కోతీయ అధ్యక్షులు
 • ఈటలకు పార్టీ చేసిన అన్యాయమేంటి?
 • వచ్చినప్పటి నుంచి వెళ్లేదాకా పదవిలోనే
 • జీజేపీలో చేరికతో రాజేందర్‌ ఆత్మవంచన
 • ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూముల సేకరణ తన ఫౌల్ట్రీ అసైన్డ్‌ కబ్జా ఒకటేనా?
 • ధ్వజమెత్తిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

గాంధీ భవన్‌లోకి గాడ్సే
గాంధీ భవన్‌లోకి గాడ్సే దూరిండు. ఇది నా మాట కాదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్వయంగా అన్న మాట.

ఇదీ పరిస్థితి! 
- Advertisement -

మహారాష్ట్రలో సీఎంను చెంప పగులగొడుతా అంటే కేంద్ర మంత్రిని జైల్లో పెట్టిన్రు. ఏపీలో సీఎంను తిడితే పొల్లు పొల్లు చేశిన్రు. మన రాష్ట్రంలో మాత్రం 420 గాళ్లు సీఎం కేసీఆర్‌ను పట్టుకొని మాట్లాడుతున్నరు.

 ఇదేం కోడ్‌.. ఈసీ?

ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మాత్రమే ఉండాల్సిన ప్రవర్తనా నియమావళిని ఈసీ ఈ సారి సరిహద్దు జిల్లాకు విస్తరించింది. రాబోయే రోజుల్లో దాన్ని సరిహద్దు రాష్ర్టాలకు విస్తరిస్తుందోఏమో. కేసీఆర్‌ ప్రచారానికి వస్తే డిపాజిట్‌ కూడా రాదని బీజేపీకి భయం పట్టుకుంది. అందుకే ఈసీతో ఇలా చేయించింది.

ఈటలకు టీఆర్‌ఎస్‌ చేసిన అన్యాయం ఏమిటి? పార్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి వెళ్లిపోయేదాకా పదవిలోనే ఉన్నారు. పార్టీలో అడుగు పెట్టగానే ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ఎల్పీ లీడర్‌గా చేశారు. ఏడేండ్లుగా మంత్రిగా కొనసాగారు. అన్నం పెట్టిన కేసీఆర్‌కు.. అన్నలాంటి కేసీఆర్‌కు అన్యాయం చేసి.. రాజకీయంగా జన్మనిచ్చిన టీఆర్‌ఎస్‌ను బొంద పెడుతా అంటవా? ఈటలా.. ఇదా నీ గౌరవం? నీ విజ్ఞత.

.. కేసీఆర్‌ పిలిస్తే పోను, ఫోన్‌ చేస్తే పలుకను.. అన్నడు ఈటల. తప్పు చేయకుంటే వెళ్లి ముఖ్యమంత్రికి చెప్పడం ధర్మం కాదా? ఒక మంత్రి సఖ్యంగా ఉండకపోతే సీఎంకు బర్తరఫ్‌ తప్ప ఇంకా ఏ ఆప్షన్‌ ఉంటుంది?

ఈటల బీజేపీలో చేరి ఆత్మ వంచన చేసుకున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు హుజూరాబాద్‌ సాక్షిగా నల్ల చట్టాలన్నారు. బీజేపీలో చేరగానే తెల్ల చట్టాలయ్యాయా?

నీ డైలాగులకు భయపడం
కేసుల చిట్టా ఉందని బండి సంజయ్‌ బెదిరిస్తున్నారు. 20 ఏండ్లుగా పార్టీని నడుపుతున్నాం. ఏడేండ్లుగా అధికారంలో ఉన్నాం. ఈ డైలాగులకు భయపడేటోళ్లు ఎవరూ లేరిక్కడ. దేన్నయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వాళ్లు ఎట్లా ప్రవర్తిస్తున్నరో దేశం మొత్తం చూస్తున్నది. ఎవరి చిట్టా ఉంది? ఈటల రాజేందర్‌ అక్రమాస్తులవా? తీన్మార్‌ మల్లన్న కేసుల చిట్టానా? ధర్మపురి అర్వింద్‌ ఫేక్‌ డిగ్రీలవా? అయినా నువ్వేమన్నా చిత్రగుప్తుడివా చిట్టా రాసుకుంటూ కూర్చోవడానికి?

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్‌ త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే గోల్కొండ రిసార్ట్‌లో ఈటల, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య ఒప్పందం జరిగిందని చెప్పారు. ఒకవేళ నిజం కాదని వారు అంటే ఆధారంగా తన దగ్గర ఫొటోలు కూడా ఉన్నాయని, వాటిని బయటపెడుతానని అన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకొని, ‘ఉమ్మడి అభ్యర్థి’గా ఈటల రాజేందర్‌ను నిలబెట్టాయని కేటీఆర్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను నిలువరించాలనే ఏకైక లక్ష్యంతో ఈ రెండు పార్టీలు ‘ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌’ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. గతంలో కరీంనగర్‌, నిజామాబాద్‌, నాగార్జునసాగర్‌లో ఇదే జరిగిందని చెప్పారు. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఎగిరెగిరి పడుతున్నారని, ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నేపథ్యంలో నమస్తే తెలంగాణకు కేటీఆర్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. వివిధ అంశాలపై కేటీఆర్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

కాంగ్రెస్‌, బీజేపీ మరోసారి చీకటి ఒప్పందం
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను నిలువరించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ను నిలువరించలేమని తెలిసినప్పుడు ఈ పార్టీలు ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంటాయి. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ పార్టీలు ఒక్కటై పనిచేశాయి. నిజామాబాద్‌లో మధుయాష్కీకి డిపాజిట్‌ కూడా రాలేదు. కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్‌ పరిస్థితి కూడా దాదాపు అంతే. వీరి చీకటి ఒప్పందానికి జగిత్యాల క్లాసికల్‌ ఎగ్జాంపుల్‌. జీవన్‌రెడ్డి వంటి బలమైన నాయకుడు ఉన్న జగిత్యాలలో మధుయాష్కికి కేవలం 7వేల ఓట్లు వచ్చాయి. రెండు లక్షల ఓట్లు ఉన్నచోట అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డికి 70 వేల పైచిలుకు ఓట్లు వస్తే, పార్లమెంటు ఎన్నికల్లో మధుయాష్కీకి కేవలం 7 వేలు ఎలా వస్తాయి? దీనిని బట్టే రెండు పార్టీల మధ్య ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఉన్నదని కచ్చితంగా తెలుస్తున్నది. ఈ ఒప్పందంలో భాగంగానే నాగార్జున సాగర్‌లో బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. ఇప్పుడు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోతుంది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని విమర్శించినా ఇప్పటివరకు ఒక్క ఖండన కూడా లేదు. అంటే ఒప్పుకున్నట్టేనా? టీఆర్‌ఎస్‌ ఇప్పుడు అక్కడ ఉమ్మడి అభ్యర్థితో పోరాడుతున్నది. ఇందుకు మూడు ఉదాహరణలు చెప్తాను. 1)కాంగ్రెస్‌ పెద్దగా ప్రచారం చేయడం లేదు. నాయకులు పట్టించుకోవడం లేదు. 2)అనామకుడికి టికెట్‌ కేటాయించారు. ఆ వ్యక్తి జమ్మికుంట చౌరస్తాలో నిలబెడితే ఒక్కరు కూడా గుర్తుపట్టరు. 3)కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇప్పుడు ఈటల రాజేందర్‌కు ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రేవంత్‌రెడ్డి కూడా ఎక్కడా కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పడం లేదు.

కోతీయ అధ్యక్షులు
రెండు జాతీయ పార్టీలకు రెండు కోతీయ రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎగిరెగిరి పడుతున్నరు. రేవంత్‌రెడ్డి రాజకీయ విశ్లేషకుడిగా ఏ పార్టీలో ఏం జరుగుతుందో చెప్పే బదులు హుజూరాబాద్‌లో వాళ్ల సొంత అభ్యర్థికి డిపాజిట్‌ వస్తుందో రాదో చెప్పాలి. కనీసం వాళ్ల ఉమ్మడి అభ్యర్థి అయినా గెలుస్తాడని చెప్పగలరా? కేసుల చిట్టా ఉన్నదని బండి సంజయ్‌ బెదిరిస్తున్నారు. ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు. దేన్నయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. 20 ఏండ్లుగా పార్టీని నడుపుతున్నాం. ఏడేండ్లుగా అధికారంలో ఉన్నాం. ఈ డైలాగులకు భయపడేటోళ్లు ఎవరూ లేరిక్కడ. ఎవరి చిట్టా ఉన్నది? ఈటల రాజేందర్‌ అక్రమాస్తులవా? తీన్మార్‌ మల్లన్న కేసుల చిట్టానా? ధర్మపురి అర్వింద్‌ ఫేక్‌ డిగ్రీలవా? నువ్వేమన్నా చిత్రగుప్తుడివా చిట్టా రాసుకుంటూ కూర్చోవడానికి? ఇప్పుడు క్రిమినల్‌ కేసులున్నవారు, తప్పుడు పనులు చేసేవాళ్లంతా బీజేపీలో చేరుతున్నారు.

ఈటలకు జరిగిన అన్యాయం ఏమిటి?
ఈటలకు టీఆర్‌ఎస్‌ చేసిన అన్యాయం ఏమిటి? పార్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి వెళ్లిపోయేదాకా పదవిలోనే ఉన్నారు. పార్టీలో అడుగు పెట్టగానే ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఎల్పీ లీడర్‌ పనిచేశారు, ఏడేండ్లు మంత్రిగా కొనసాగారు. మంత్రిగా ఉంటూనే అనేకసార్లు పార్టీ గురించి, ప్రభుత్వ పథకాల గురించి అడ్డగోలుగా మాట్లాడారు. ఒక మంత్రిగా అలా అనవచ్చా? దళితబంధు తనవల్లే వచ్చిందని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం ప్రకటించినప్పుడు ఆయన మా పక్కన కూర్చొని బల్లలు చరిచి అభినందించారు. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం ఆత్మవంచన కాదా? అన్నం పెట్టిన కేసీఆర్‌కు, అన్నలాంటి కేసీఆర్‌కు అన్యాయం చేసి.. రాజకీయంగా జన్మనిచ్చిన టీఆర్‌ఎస్‌ను బొం ద పెడుతా అంటవా? ఇదా నీ గౌరవం? నీ విజ్ఞత? ఈటలపై వచ్చిన అభియోగాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన రోజు ఆయన విలేకరుల సమావేశం పెట్టినప్పుడు ‘సీఎంను కలుస్తారా’ అని మీడియా ప్రశ్నించగా.. ‘పిలిస్తే పోను, ఫోన్‌ చేస్తే పలుకను’ అని అన్నారు. తప్పు చేయకుంటే వెళ్లి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రికి చెప్పడం ధర్మం కాదా? ఒక మంత్రి సఖ్యంగా ఉండకపోతే సీఎంకు బర్తరఫ్‌ తప్ప ఏ ఆప్షన్‌ ఉంటుంది?

ఇప్పుడు తెల్ల చట్టాలైనయా?
ఈటల బీజేపీలో చేరి ఆత్మ వంచన చేసుకొంటున్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు హుజూరాబాద్‌ సాక్షిగా నల్ల చట్టాలుగా అభివర్ణించారు. ఇప్పుడు బీజేపీలో చేరగానే అవన్నీ తెల్ల చట్టాలుగా మారాయా? అసైన్డ్‌ భూములు కొన్నానని ఈటల స్వయంగా తన తప్పును ఒప్పుకొన్నారు. ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూముల సేకరణ, పౌల్ట్రీఫాంకు అసైన్డ్‌ భూముల కబ్జా ఒకటేనా? ఆయనపై తప్పకుండా విచారణ కొనసాగుతుంది.

కేసీఆర్‌ ప్రధానిని కలిసిస్తే తప్పా?
సీఎం కేసీఆర్‌ తన బాధ్యతల్లో భాగంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీనో, హోంమంత్రి అమిత్‌షానో కలిస్తే రెండు పార్టీలు ఏకమైనట్టు అసత్య ప్రచారం చేస్తున్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ నా అపాయింట్‌మెంట్‌ అడిగారు. రాష్ట్ర మంత్రిగా సమయం ఇచ్చాను. ఇద్దరం అనేక సమస్యలపై చర్చించాం. అంతమాత్రాన నేను, రాజాసింగ్‌ ఒక్కటైనట్టేనా? అదేవిధంగా ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిస్తే తప్పేముంది?

ఈసీ తన పరిధి దాటింది..
హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించటం ఈసీ తన పరిధిని అతిక్రమించడమే. ఎప్పటినుంచో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాన్ని ఈసీ ఎట్లా ఆపుతుంది? ఎవరూ అడిగేవారు లేకనా? ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ. దానికి కొన్ని పరిమితులున్నాయి. ఈసీ చరిత్రలో ఇలా పరిధి దాటి ఎన్నడూ ప్రవర్తించలేదు. వాసాలమర్రిలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైన దళితబంధు హుజూరాబాద్‌లో కొనసాగుతున్నది. వేలమంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. రూ.1 లక్షా 70వేల కోట్ల పథకాన్ని హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే తెస్తామా? ఈసీకి తెలంగాణకు ఒక నీతి.. దేశమంతా ఒక నీతా? ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మాత్రమే ఉండాల్సిన ఎన్నికల నియమావళిని ఈసీ ఈసారి సరిహద్దు జిల్లాకు విస్తరించింది. రాబోయే రోజుల్లో ఇది సరిహద్దు రాష్ర్టాలకు విస్తరిస్తుందో ఏమో! కేసీఆర్‌ ప్రచారానికి వస్తే డిపాజిట్‌ కూడా రాదని బీజేపీకి భయం పట్టుకునే ఈసీతో ఇటువంటి పనులు చేయిస్తున్నది.

పంథా మారుస్తాం..

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యకలాపాలపైనే దృష్టి సారించాం. ఇకనుంచి పార్టీకి, ప్రభుత్వానికి సమ ప్రాధాన్యం ఇస్తాం. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయనన్ని కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ చేపట్టింది. రాయచూర్‌ బహిరంగసభలో మంత్రి వేదిక మీద ఉండగానే బీజేపీ ఎమ్మెల్యే శివకుమార్‌ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అమలు చేసినట్టు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. లేదంటే రాయచూర్‌ను తెలంగాణలో కలపండి అని డిమాండ్‌ చేశారు. ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్స్‌ ఏం కావాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువచేసేందుకు పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పార్టీని తయారుచేస్తాం. ఈ నెల 25న జరిగే ప్లీనరీకి 6,500 మంది ప్రతినిధులు హాజరవుతారు. వచ్చేనెల 15న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలనకు నవంబర్‌ 1 తరువాత నేను వెళ్తాను. పార్టీ అంతర్గత నిర్మాణంపై అధ్యయనం కోసం విజయగర్జన సభ అనంతరం పార్టీ నేతల బృందం తమిళనాడు వెళ్తుంది. విజయగర్జన సభ తరువాత 6 నుంచి 9 నెలల వరకు పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం.

గాంధీ భవన్‌లో గాడ్సే
గాంధీ భవన్‌లోకి గాడ్సే దూరాడు. ఇది నా మాట కాదు.. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్వయంగా అన్నారు. ఆరెస్సెస్‌ మూలాలున్న వాళ్లను పీసీసీ అధ్యక్షుడిని చేశారని అమరీందర్‌ చెప్పారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? జీవన్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు వంటివారు ఏమయ్యారు? రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్త పార్టీలన్నీ ఢిల్లీ పార్టీల చేతుల్లో పాచికలే. టీఆర్‌ఎస్‌ను నిలువరించే ప్రణాళికలో భాగంగా ఏర్పడినవే. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, షర్మిల వంటివాళ్లు టీఆర్‌ఎస్‌నే అంటున్నారు తప్ప బీజేపీనో, కాంగ్రెస్‌నో ఒక్క మాట అనడంలేదు. వాళ్లు ఇప్పుడు హుజూరాబాద్‌లో ఎందుకు పోటీ చేయట్లేదు? వీళ్ల లక్ష్యం టీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకును చీల్చడమే. రాజకీయాల్లో హుందాతనం, మర్యాద ఉండాలి.

రేవంత్‌.. ఈటల.. గోల్కొండ రిసార్ట్‌
హుజూరాబాద్‌ ఫలితం ఎలా ఉన్నా ఈటల రాజేందర్‌ మరో ఏడాది, ఏడాదిన్నరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం. ఈ ఒప్పందం ముందే జరిగిపోయింది. గోల్కొండ రిసార్ట్‌లో ఈటల రాజేందర్‌, రేవంత్‌రెడ్డి రహస్యంగా కలుసుకొని చర్చలు జరిపారు. ఇది నిజం కాదా? ఒకవేళ నిజం కాదని వారు అంటే ఆధారంగా నా దగ్గర ఫొటోలు కూడా ఉన్నాయి. వాటిని తగిన సమయంలో బయటపెడుతా.

టీడీపీకి అంత యావ ఎందుకు?
ఏపీలో టీడీపీకి అంత అసహనం ఎందుకు? ఆ బూతులు ఏంది? టీడీపీ ఆఫీస్‌ల మీద దాడులు ఏంది? ఎవరు చేశారనేది పక్కనబెడితే దానికి మూలం ఎక్కడుంది? అనేది ఆలోచించాలి. ప్రజలు అధికారాన్ని ఇంకొకరికి ఇచ్చారు. అది ఒప్పుకోవాలి. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్లను మెప్పించాలి. నీకెందుకు ఓటేయాలో చెప్పాలి. అంతేగానీ అర్జంటుగా అధికారంలోకి రావాలన్న యావ ఎందుకు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement