హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఫాక్స్‌కాన్ సంస్థ పెట్టిన భారీ పెట్టుబడి నేడు పూర్తిస్థాయిలో సాకారమవ్వడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సంతోషం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటుచేసిన ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ విజయవంతంగా నడుస్తూ, వేలాదిమందికి ఉపాధి కల్పిస్తుండటంపై బుధవారం ఎక్స్ వేదికగా హర్షం ప్రకటించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు పునాదులు పడిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడేండ్ల క్రితం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్లీయూ సమక్షంలో ఈ చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ‘ఫాక్స్‌కాన్ పెట్టుబడి ఇలా ఓ రూపం దాల్చడం చూస్తుంటే నా హృదయం ఎంతోగర్వంతో, సంతోషంతో నిండిపోతున్నది.
కేసీఆర్, ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్లీయూ సమక్షంలో ఎంవోయూ కుదిరిన మూడేండ్ల తర్వాత.. నేడు కొంగరకలాన్‌లోని ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో నడుస్తూ, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నద’ని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా నాడు తాము చేసిన కృషి నేడు క్షేత్రస్థాయిలో వేలాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తూ సత్ఫలితాలను ఇస్తుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. నాడు ఎంవోయూ సందర్భంగా తీసిన ఫొటోలతోపాటు నేడు వేల మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల ఫొటోలను షేర్ చేశారు.