సూర్యాపేటటౌన్, మే 20 : తాను మావోయిస్టునంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వచ్చిన ఓ వ్యక్తి హల్ చల్ చేసిన ఘటన బుధవారం సూర్యాపేటలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన పెద్దోజు దేవేంద్రాచారి అలియాస్ జగన్ పేరుతో ఓ వ్యక్తి సూర్యాపేట ఎస్సీ నర్సింహ ఎదుట లొంగిపోయేందుకు వచ్చాడు. అప్పట్లో తమ ప్రాంతంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక సమస్యలపై పోరాడేందుకు మావోయిస్టుగా మారానన్నాడు. తనను సుఖదేవ్, కిరణ్, హరిభూషణ్ రిక్రూట్ చేసుకున్నట్లు వివరించారు.
ఆదివాసీలతో ఉంటూ సిద్ధాంతాల కోసం పోరాడుతూ ఆయుధాల తయారీ విభాగంలో పని చేశానన్నాడు. రెండు సంవత్సరాలు తెలంగాణ ప్రాంత దళంలో పని చేసి, ప్రస్తుతం లొంగిపోయేందుకు వచ్చానని, పునరావాస ప్యాకేజీ అందివ్వాలని కోరాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతని నేర చరిత్రపై ఆరా తీశారు. అతను చెబుతున్న వివరాలకు ఎక్కడా పొంతన లేక పోవడం, పోలీసు రికార్డుల్లో ఎక్కడా పేరు లేక పోవడంతో అతని తీరుపై అనుమానం వచ్చి పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన గత ఐదు సంవత్సరాలుగా తన సోదరి స్వగ్రామమైన ఆత్మకూర్.ఎస్ మండలం పాతర్లపహాడ్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ వడ్రంగి పని చేస్తూ జీవిస్తున్నాడని తెలిసింది. కేవలం పునరావాస ప్యాకేజీ కోసమే ఈ డ్రామా ఆడినట్లు గుర్తించిన పోలీసులు దేవేంద్రచారికి కౌన్సెలింగ్ ఇచ్చి పాతర్లపహాడ్కు పంపించివేశా రు.